హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై యువతలో అవగాహన పెంపునకు బైక్ ర్యాలీ
కామారెడ్డి : హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై యువతలో అవగాహన పెంపునకు బైక్ ర్యాలీ హెచ్‌ఐవీ నివారణకు అవగాహనే ప్రధాన ఆయుధం – అదనపు కలెక్టర్ విక్టర్ హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై యువతలో విస్తృత అవగాహన కల్పించి, వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు శుక్రవారం కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి నిర్వహించిన హెచ్‌ఐవీ, ఎయిడ్స్ అవగాహన బైక్ ర్యాలీని అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్. వై గిరితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై సమాజంలోని ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా యువతకు సరైన అవగాహన ఉండాలని అన్నారు. వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించి, నివారణ మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో చైతన్యం పెంపొందించాలని సూచించారు. హెచ్‌ఐవీ నివారణకు వైద్యారోగ్య శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ బైక్ ర్యాలీ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ప్రారంభమై నూతన బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, రైల్వే స్టేషన్, సిరిసిల్ల రోడ్డు మీదుగా రామారెడ్డి చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం తిరిగి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం వద్ద ముగిసింది. ర్యాలీలో పాల్గొన్న వైద్య సిబ్బంది హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణపై నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. హెచ్‌ఐవీ నివారణకు విస్తృత అవగాహన కార్యక్రమాలు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వై.ఎన్. గిరి మాట్లాడుతూ, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. వ్యాధి పట్ల వివక్ష చూపకుండా, బాధితులకు గౌరవం, సహకారం అందించాలని సూచించారు. నివారణ చర్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, యువత ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. హెచ్‌ఐవీ రహిత జిల్లాగా కామారెడ్డిని తీర్చిదిద్దేందుకు కృషిజిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ జె. వెంకటి మాట్లాడుతూ, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో హెచ్‌ఐవీ నివారణ, అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. యువతలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై మరింత చైతన్యం కల్పించేందుకు రానున్న రోజుల్లోనూ విస్తృతంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. హెచ్‌ఐవీ నివారణపై సరైన అవగాహన కల్పిస్తూ, కామారెడ్డిని హెచ్‌ఐవీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు, డాక్టర్ వెంకట్ స్వామి, డాక్టర్ రోహిత్, డాక్టర్ సాయి ఈశ్వరి, డాక్టర్ స్నేహ, డాక్టర్ అంచల్, జిల్లా కార్యక్రమ నిర్వహణ అధికారి సుధాకర్, ఉప జిల్లా విస్తరణ మరియు మాధ్యమ అధికారి వేణుగోపాల్, ఓఎస్‌డీ చలపతి, ఈసీ స్వామి, రమేష్, కార్యాలయ పర్యవేక్షకుడు అమ్రీష్, కార్యాలయ సిబ్బంది, హెచ్‌ఐవీ ఎయిడ్స్ నియంత్రణ విభాగం సిబ్బంది, రాజీవ్‌నగర్, ఇస్లాంపురా సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


