పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు ఉచిత వైద్య సేవలు
- న్యూరో, గైనకాలజీ, డెంటల్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ నిపుణులచే వైద్య పరీక్షలు
- కాటరాక్ట్ సమస్య ఉన్నవారికి ఉచిత కంటి వైద్య చికిత్సకు ఏర్పాట్లు
- రోడ్డు భద్రత, మహిళల భద్రత, సీసీటీవీ కెమెరాలపై అవగాహన కల్పించిన ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా సత్నాల మండలం మేడిగూడ గ్రామంలో ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడంతో పాటు పోలీసు–ప్రజల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఆదివాసీ సంప్రదాయాలతో ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ వైద్యులు, పాఠశాల విద్యార్థులచే వైద్య శిబిరాన్ని ప్రారంభించి, నిపుణులైన వైద్యులచే గ్రామస్తులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. న్యూరో ఫిజీషియన్, గైనకాలజీ, డెంటల్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ విభాగాల్లో నిపుణులైన వైద్యులు సుమారు 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు, చికిత్సలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఉజ్వల భవిష్యత్తుకు ఉన్నత చదువులు ఎంతో ముఖ్యమని, విద్యార్థులు చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. నేటి విద్యార్థులే రేపటి దేశ పౌరులని, విద్య ద్వారా సమాజం, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు అర్హత కలిగిన ప్రభుత్వ లేదా ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని, నకిలీ బాబాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఎస్పీ సూచించారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేసే వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య శిబిరంలో భాగంగా కాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. అవసరమైన వారికి వాహన సౌకర్యం కల్పించి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అనంతరం తిరిగి గ్రామానికి చేర్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే వ్యసనానికి గురైన వారికి డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స అందించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు తమ ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. నేరాల నియంత్రణతో పాటు నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడంలో సీసీటీవీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలని ఎస్పీ తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి వారి చదువు, భవిష్యత్తు లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో జైనథ్ సీఐ జి. శ్రావణ్, ఎస్సై పి. గౌతమ్, గ్రామ సర్పంచ్ లక్ష్మీబాయి, ఉప సర్పంచ్ నౌసర్, వైద్యులు నవీన్ రెడ్డి, సిద్ధార్థ్, భాగ్యలక్ష్మి, ఆనంద్, రామకృష్ణ, ఎల్.వి. ప్రసాద్ ఆసుపత్రి సిబ్బంది, గ్రామ పెద్దలు రామ్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, గ్రామ ప్రజలు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


