వైరా పరిధిలోని పిహెచ్సి లను అప్గ్రేడ్ చేయాలి
దామోదర రాజ నరసింహకు ఎమ్మెల్యే వినతి.
కారేపల్లి(ఖమ్మం) : వైరా నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)ను ఉన్నతీకరించాలని కోరుతూ వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహను కలిసి వినతిపత్రం అందజేశారు.అసెంబ్లీ మినిస్టర్స్ ఛాంబర్‌లో మంగళవారం మంత్రి దామోదర రాజ నరసింహను ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సింగరేణి,ఏన్కూరు, జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల ప్రజలు మెరుగైన వైద్యం కోసం దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తున్న పరిస్థితులను వివరించారు.పీహెచ్సీలను ఉన్నతీకరించడం ద్వారా స్థానికంగానే మరిన్ని వైద్య సేవలు అందించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సత్వర వైద్యం అందే అవకాశం ఉంటుందని తెలిపారు.ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగరేణి,ఏన్కూరు, జూలూరుపాడు పీహెచ్సీల అప్‌గ్రేడేషన్‌కు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతుల అభివృద్ధి,అవసరమైన వైద్య సేవల విస్తరణ,ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


