జలదోపిడీని అడ్డుకునేందుకు పార్టీలకు అతీతంగా పోరాడాలి.

జలదోపిడీని అడ్డుకునేందుకు పార్టీలకు అతీతంగా పోరాడాలి.

  • సీఎం సొంత జిల్లాలోనే పాలమూరు రైతులకు సాగునీటి అన్యాయమా?
  • డిండి పేరుతో పాలమూరు నీటి తరలింపును తక్షణమే నిలిపివేయాలి.
  • సెప్టెంబర్‌ 12న నాగర్‌కర్నూల్‌లో జలసాధన సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలి.
  • ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ.

నాగర్‌కర్నూల్ :సీఎం సొంత జిల్లాలోనే పాలమూరు రైతాంగానికి జరుగుతున్న సాగునీటి అన్యాయాన్ని అడ్డుకోలేకపోతున్నామని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా పాలమూరు జలాల విషయంలో వివక్ష మాత్రం మారడం లేదని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు దక్కాల్సిన నీటిని డిండి ప్రాజెక్టు పేరుతో నల్లగొండ వైపు తరలించే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కో-కన్వీనర్ రాఘవాచారి,కో-చైర్మన్ శ్యాం ప్రసాద్‌రెడ్డి కో కన్వీనర్,చిన్న కిష్టన్న తదితరులు మాట్లాడారు...
ప్రభుత్వాలు మారుతున్నాయి.. జలదోపిడీ ఆగడం లేదు
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ పాలమూరు సాగునీటి సమస్యకు న్యాయం జరగలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించడం లేదని జేఏసీ నాయకులు విమర్శించారు. కృష్ణానది ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాంతంలో సుమారు 300 కిలోమీటర్లు ప్రవహిస్తున్నప్పటికీ, ఈ ప్రాంత రైతాంగం సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తోందన్నారు.
ఒకవైపు పాలమూరు ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు తమ ప్రాంతానికి దక్కాల్సిన నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాలమూరు రైతుల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వమే నీటి తరలింపును అనుమతిస్తే భవిష్యత్తులో అది జిల్లాకు శాశ్వత నష్టంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
చంద్రబాబు,వైఎస్సార్ హయాంలోనూ అన్యాయమేనా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి పాలమూరు ప్రాంతం సాగునీటి విషయంలో అన్యాయానికి గురవుతోందని జేఏసీ నాయకులు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వాల హయాంలోనూ పాలమూరు జలాల విషయంలో వివక్ష కొనసాగిందని విమర్శించారు. ప్రభుత్వాలు, పార్టీలు మారుతున్నా పాలమూరు రైతుల పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదన్నారు. నదులు తమ ప్రాంతంలో ప్రవహిస్తున్నా తమ పొలాలకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తమకు దక్కాల్సిన నీటిని కూడా డిండి పేరుతో తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ఇంకెంతకాలం కొనసాగుతుందని ప్రభుత్వాలను ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ తదితర ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని కీలక పనులను వేగవంతం చేసి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రైతాంగానికి సాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా పాలమూరు రైతులకు దక్కాల్సిన నీటిని డిండి ప్రాజెక్టు పేరుతో తరలించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు. పాలమూరు జలాలపై జరుగుతున్న అన్యాయాన్ని ఇక మౌనంగా చూస్తూ ఊరుకోం. జలదోపిడీని అడ్డుకునే వరకు పోరాటం కొనసాగిస్తాం అని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.
12న జలసాధన సత్యాగ్రహ దీక్ష
పాలమూరు సాగునీటి హక్కుల సాధన కోసం ఈ నెల 12న నాగర్‌కర్నూల్ గాంధీ పార్కులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జలసాధన సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. రైతులు, ప్రజలు, ప్రజాస్వామి కవాదులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాలమూరు జలాల పరిరక్షణ కోసం అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఏకతాటిపైకి రావాలని కోరారు. అనంతరం ఈనెల 12వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద నిర్వహించే సత్యాగ్రహ దీక్షకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సమావేశంలో వామన్‌ కుమార్, గోవర్ధన్, మహేష్‌గౌడ్, జనసేన పార్టీకి చెందిన,ఎం.డి.ఆరిఫ్ అంజయ్యచారి, తెలంగాణ జన సమితికి చెందిన ఎం.డి.మేరాజ్ , వినయ్‌కుమార్, బి.రమేష్, అబ్దుల్ రాఫ్, పులిందర్ రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ