వి డి సి పేరుతో అధికారులను తప్పుదోవ పట్టించారా?
- గ్రామసభ లేకుండానే నకిలీ తీర్మానాలా?..
- బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
కాటారం (భూపాలపల్లి) : మేడిపల్లి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించకుండానే వి డి సి కమిటీ ఏర్పాటు చేసినట్లు చూపిస్తూ తప్పుడు తీర్మానాలు, అనుమానాస్పద సంతకాలతో పత్రాలు సృష్టించి ఈ టి డి ఏ , పంచాయతీరాజ్ అధికారులను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై ఆదివాసీ నాయకపోడ్ సేవ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు గొట్టం భూమయ్య ఐ టి డి ఏ ఎటుర్నాగారం ప్రాజెక్ట్ అధికారికి ఫిర్యాదు చేశారు. వి డి సి ఏర్పాటుకు సంబంధించిన పత్రాలపై సమగ్ర విచారణ చేపట్టడంతో పాటు, అనుమానాస్పదంగా ఉన్న సంతకాలపై ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించాలని ఆయన కోరారు. ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, అధికారులను తప్పుదోవ పట్టించడం, ప్రజాధన దుర్వినియోగం జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గిరిజనుల హక్కులకు భంగం కలిగినట్లు నిర్ధారణ అయితే ఎస్ సి, ఎస్ టి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని, సర్పంచ్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే చట్టప్రకారం పదవి నుంచి తొలగించే చర్యలు చేపట్టాలని పి ఓ ను కోరారు. ఈ సందర్భంగా భూమయ్య వెంట మాజీ సర్పంచ్ చింతల సుధాకర్, గ్రామస్థుడు అప్పాల భూమేష్ యాదవ్ ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


