బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టులు.
. కాంగ్రెస్ నేతలకు రక్షణ కల్పిస్తారా?
- కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
- బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి
- బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి
బోడుప్పల్, : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ జెడ్పీటీసీ,బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి మేడిపల్లి పోలీసులను డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి యత్నించిన వారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. హౌస్ అరెస్టులో ఉన్న మంద సంజీవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు చేపడుతుంటే పోలీసులు వారిని ముందస్తుగా హౌస్ అరెస్టులు చేసి నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి యత్నించినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు.బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసే పోలీసులు.. కాంగ్రెస్ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన నిలదీశారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతోందని విమర్శించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు వ్యవహరించాలని కోరారు. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించిన ఆధారాలు, సమాచారాన్ని మేడిపల్లి సీఐకి అందించామని తెలిపారు. ఘటనలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు కాటపల్లి రామచంద్రారెడ్డి,కొత్త చక్రపాణి గౌడ్,బందారం శ్రీధర్ గౌడ్,కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


