5 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను విస్మరిస్తే ఎలా పాల్గొంటాం?

 5 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను విస్మరిస్తే ఎలా పాల్గొంటాం?

హైదరాబాద్: రాష్ట్రంలోని సుమారు 5 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ప్రధాన సమస్యలను ఎజెండాలో చేర్చకుండా సెప్టెంబర్ 10న నిర్వహించనున్న “చలో హైదరాబాద్–మహా ధర్నా” కార్యక్రమానికి తమ మద్దతు లేదని తెలంగాణ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్ పులి లక్ష్మయ్య స్పష్టం చేసింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ఒక్క పాయింట్ కూడా ప్రాధాన్యత ఇవ్వని కార్యక్రమంలో రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొనబోరని ప్రకటించింది. తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, సంస్థలు, సొసైటీలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు 5 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వానికి సేవలందిస్తున్నారని జేఏసీ పేర్కొంది. ప్రభుత్వ కార్యకలాపాల్లో కీలకంగా పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలు, సామాజిక భద్రత, సకాలంలో జీతాల చెల్లింపు వంటి ప్రాథమిక సమస్యలు నేటికీ పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
“మరి మా సమస్యలు ఎక్కడ?”
PRC, DA, CPS–OPS, పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డులు, ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలపై చర్చిస్తున్నప్పుడు ప్రభుత్వ శాఖల్లో వెన్నెముకలా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు మాత్రం ఎందుకు స్థానం కల్పించడం లేదని జేఏసీ ప్రశ్నించింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తక్కువ వేతనాలు, ఏజెన్సీలు–కాంట్రాక్టర్ల పెత్తనం, ఉద్యోగ భద్రత లేకపోవడం, జీతాల చెల్లింపుల్లో జాప్యం, PF–ESI సమస్యలు, సరైన సామాజిక భద్రత లేకపోవడం వంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపింది. ఐదు లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పక్కన పెట్టి నిర్వహించే సభలో మేమెందుకు పాల్గొనాలి?” అని జేఏసీ ప్రశ్నించింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జేఏసీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
1. విద్యా సంస్థల్లో 12 నెలల జీతాలు:
ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ సంవత్సరానికి 12 నెలల పూర్తి వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
2. ఏజెన్సీ వ్యవస్థ రద్దు:
ఏజెన్సీ, కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి.
3. IFMIS/DBT ద్వారా నేరుగా జీతాలు:
ఉద్యోగుల వేతనాలను IFMIS/DBT విధానం ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి.
4. సమాన పనికి సమాన వేతనం:
రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.
5. ఉద్యోగ భద్రత: రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎలాంటి కారణం లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించకుండా స్పష్టమైన విధానం రూపొందించాలి.
6. తొలగించిన ఉద్యోగుల పునర్నియామకం: అన్యాయంగా విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.
7. వేతన సవరణలు, ఇంక్రిమెంట్లు: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతన సవరణలు, వార్షిక ఇంక్రిమెంట్లు అమలు చేయాలి.
8. PF–ESI, సామాజిక భద్రత: ప్రతి ఉద్యోగికి PF, ESI తదితర సామాజిక భద్రతా ప్రయోజనాలను పూర్తిస్థాయిలో కల్పించాలి.
9. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు: మహిళా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లింపుతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలి.
10. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు భద్రత: విధి నిర్వహణలో మరణించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు తగిన పరిహారం, కుటుంబ భద్రత కల్పించాలి.
11. సేవా విరమణ ప్రయోజనాలు: దీర్ఘకాలంగా ప్రభుత్వానికి సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తగిన సేవా విరమణ ప్రయోజనాలు కల్పించాలి.
12. శాశ్వత విధానం: సంవత్సరాలుగా ప్రభుత్వానికి సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తుకు శాశ్వతమైన, స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలి.
అక్టోబర్‌లో హైదరాబాద్‌లో “ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల గర్జన”
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి మరింత బలంగా తీసుకెళ్లేందుకు అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా సుమారు లక్ష మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో “ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల గర్జన” కార్యక్రమాన్ని నిర్వహించను న్నట్లు జేఏసీ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని సుమారు 5 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆకాంక్షలు, ఆవేదనలు, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేస్తామని జేఏసీ తెలిపింది. “మాకు ఎవరిపైనా వ్యతిరేకత లేదు. మా పోరాటం 5 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల కోసం. మా సమస్యలు లేని సభకు మా మద్దతు లేదు. మా సమస్యల పరిష్కారం కోసం మాత్రం మా పోరాటం ఆగదు” అని జేఏసీ రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న నిర్వహించనున్న “చలో హైదరాబాద్–మహా ధర్నా” కార్యక్రమానికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దూరంగా ఉండాలని, అక్టోబర్‌లో ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న “ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల గర్జన” కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రతి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఐక్యంగా తరలిరావాలని జేఏసీ పిలుపునిచ్చింది. “5 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల గొంతు ఒక్కటే మా హక్కుల సాధన కోసం మా గర్జన ఒక్కటే!” అని జేఏసీ రాష్ట్ర కమిటీ నినదించింది.

Views: 232

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ