ముగ్గురు మంత్రులే బాధ్యత వహించాలి

ఖమ్మం : ఖమ్మం పట్టణంలో ప్రభుత్వం కూల్చి వేసిన ఇండ్లు ఉన్న భూధాన భూములు విషయంలో మంత్రి తుమ్మల వ్యాఖ్యలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు తీవ్రంగా ఖండించారు. పేదల ఇళ్ల కూల్చివేత కి జిల్లా కి చెందిన ముగ్గురు మంత్రులే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోతినేని మాట్లాడుతూ మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని విమర్శించారు. భూధాన భూములు విలువైనవని పేర్కొనడం సరైనది కాదని అన్నారు. భూధాన భూములు దానం చేసిన వారు పేదల కోసమే దానం ఇచ్చారని గుర్తు చేశారు. 1965, భూదాన యజ్ఞ బోర్డు చట్టం కూడా ఈ భూములు పేదలకే ఇవ్వాలని చెపుతున్నదని ఆయన అన్నారు. అవి విలువ ఎక్కువున్నా, తక్కువున్నా పేదలకే చెందుతాయని ఆయన తెలిపారు. చట్టాన్ని పక్కన పెట్టి “విలువైన భూములు” అనే పేరుతో పేదలను అక్కడి నుంచి వెళ్లగొట్టడం చట్ట ఉల్లంఘనతో సమానమని స్పష్టం చేశారు. 147, 148, 149 సర్వే నంబర్లలో ఉన్న భూముల్లో పేదలకు అక్కడికక్కడే పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూధాన భూముల్లో ఇళ్లు కోల్పోయిన పేదలను చీలదీసి, బెదిరించి నష్టం కలిగించేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారికి షెల్టర్ గా ప్రస్తుతం కేటాయించిన అంబేద్కర్ భవన్, టిటిడిసి భవనాలకు వాడుకొనే నీళ్ళు కూడా బంద్ చేశారు. అక్కడ వృద్ధులు, చంటి పిల్లల తల్లులు, గర్భిణీ స్తీలు నరకం అనుభవిస్తున్నారని అన్నారు. గుట్టలలో ఇళ్లు వేసుకుని నివసిస్తున్న వారు అంతా పేదలేనని, వారికి న్యాయం చేయాలని కోరారు. వారిని స్వంత గ్రామాలకు పంపాలని మండల రెవిన్యూ అధికారులతో వత్తిడి చేసి భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. పునరావాస కేంద్రాల్లో తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఈ విషయంపై నైతిక బాధ్యత వహించాలని అన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


