వరంగల్ విద్యా అభివృద్ధిపై పార్లమెంట్‌లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ

వరంగల్ విద్యా అభివృద్ధిపై పార్లమెంట్‌లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ

హన్మకొండ : వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్, భౌతిక మౌలిక వసతుల కల్పనపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో ప్రస్తావించారు. సమగ్ర శిక్ష పథకం అమలు, డిజిటల్ విద్య విస్తరణ, పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధి, కేంద్ర నిధుల కేటాయింపులపై సమగ్ర వివరాలు కోరారు. గత కొంతకాలంగా వరంగల్‌లో ప్రభుత్వ విద్య బలోపేతం, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల పెంపు అంశాలను నిరంతరం పార్లమెంట్‌లో ప్రస్తావిస్తున్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తాజాగా డిజిటల్ విద్యా మౌలిక వసతులపై కేంద్రాన్ని ప్రశ్నించారు. తెలంగాణతో పాటు వరంగల్ జిల్లాకు గత ఐదేళ్లలో కేంద్రం నుంచి అందిన సహాయం, చేపట్టిన పనులు, విద్యార్థులకు కలిగిన ప్రయోజనాల వివరాలను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సమగ్ర శిక్ష పథకం కింద దేశవ్యాప్తంగా పీఎం ఈ-విద్య, దీక్ష, ఐసీటీ ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల ద్వారా సాంకేతిక ఆధారిత బోధనను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాల వార్షిక కార్యాచరణ ప్రణాళికల మేరకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణకు గత ఐదేళ్లుగా డిజిటల్ విద్యా వసతుల అభివృద్ధికి గణనీయమైన మద్దతు లభించిందని కేంద్రం వెల్లడించింది. 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్రానికి 1,242 ఐసీటీ ల్యాబ్‌లు, 2,036 స్మార్ట్ క్లాస్‌రూమ్‌లకు ఆమోదం లభించగా, ఇందుకు రూ.108.98 కోట్ల మేర నిధులు మంజూరు చేసినట్లు పేర్కొంది.ఈ మేరకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్‌లో ప్రభుత్వ విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. పార్లమెంట్ వేదికగా వరంగల్ అవసరాలను నిరంతరం కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నానని, విద్య, మౌలిక వసతులు, డిజిటల్ సదుపాయాల విషయంలో మరిన్ని నిధులు, ప్రాజెక్టులు సాధించేందుకు తన కృషి కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతు న్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలంటే డిజిటల్ వసతులు, ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు అత్యంత కీలకమని పేర్కొన్నారు. అందుకు కేంద్రం మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరారు. వరంగల్‌ను విద్యా రంగంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు తాము కట్టుబడి ఉన్నామని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య స్పష్టం చేశారు. 
 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News