పుల్కల్ లో రోడ్డెక్కిన రైతన్నలు

పుల్కల్ లో రోడ్డెక్కిన రైతన్నలు

చౌటకూర్  : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలో ఉన్న పుల్కల్, మిన్పూర్, కోడూరు, గోంగ్లూర్, గ్రామాలలోనీ ఏటిలో ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ మోటార్లకు ఎలాంటి ముందస్తు నోటీసు, చాటింపు లేదా సమాచారం ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతులు సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పంటలకు నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం పూర్తిగా నీటిపారుదలపై ఆధారపడి ఉన్న సమయంలో ఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేయడం వల్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సమంజసమనిప్రశ్నించారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ముందు రైతులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న పుల్కల్ తహసీల్దార్ వంశీకృష్ణ, స్థానిక సీఐ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను ఓపికగా విన్న అధికారులు, సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే విద్యుత్ సరఫరా అంశాన్ని అత్యవసరంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..వ్యవసాయాన్ని దెబ్బతీసే విధంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడం సరికాదని, రైతుల జీవనాధారమైన సాగుకు ప్రభుత్వం, విద్యుత్ శాఖ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
 
1001133936
Views: 197

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News