బీమా హామీ అమలు చేయాలి..

యూనియన్ బ్యాంక్ ఎదుట విశ్రాంత ఉద్యోగుల ధర్నా

బీమా హామీ అమలు చేయాలి..

బెల్లంపల్లి  / మంచిర్యాల : సింగరేణిలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన కోల్ మైన్స్ పెన్షన్‌దారులకు రూ.30 లక్షల ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా తాండూర్‌లోని యూనియన్ బ్యాంక్ శాఖ ఎదుట సోమవారం సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ నిశాంత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గజ్జెళ్లి వెంకటయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, యూనియన్ బ్యాంక్ మధ్య 2024 ఫిబ్రవరి 26న కుదిరిన ఒప్పందం ప్రకారం 70 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన యూనియన్ బ్యాంక్ ఖాతాదారులైన సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు రూ.30 లక్షల ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం అందించాల్సి ఉందన్నారు. అయితే రెండేళ్లుగా ఈ హామీ అమలు కాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పది రోజులలోపు అర్హులైన పెన్షన్‌దారులకు బీమా సౌకర్యాలు అమలు చేయాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా యూనియన్ బ్యాంక్ శాఖల ఎదుట విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుత ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసం రాజయ్య, తగరం రాజన్న, తోటపల్లి ఎల్లయ్య, దేవరకొండ మౌగిలి, కే. దుర్గాస్వామి, కే. లక్ష్మి, ఎర్రయ్య, సీ. రాయలింగు, ఎడ్ల గొంతయ్యతో పాటు మాదారం, తాండూర్, తంగళ్లపల్లి, కొత్తపల్లి, కొత్తగుడిసెలు తదితర ప్రాంతాలకు చెందిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News