మంజీరాలో కలుస్తున్నది వర్షపు నీరే.

వ్యర్థ జలాలు కావు: పరిశ్రమ కాంట్రాక్టు కార్మికుల వివరణ

మంజీరాలో కలుస్తున్నది వర్షపు నీరే.

చౌటకూరు: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేటలోని బీరు పరిశ్రమ నుంచి మంజీరా నదిలోకి వ్యర్థ జలాలను విడుదల చేస్తున్నారనే ప్రచారం అవాస్తవమని పరిశ్రమ కాంట్రాక్టు కార్మికులు స్పష్టం చేశారు. ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశమైన కార్మికులు మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమలోని వ్యర్థ జలాలన్నింటినీ ప్రత్యేక శుద్ధి కేంద్రం (ఈటీపీ)లో శుద్ధి చేస్తున్నామని తెలిపారు. మంజీరా నదిలో కలుస్తున్నది పరిశ్రమ వ్యర్థ జలాలు కాదని, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పరిశ్రమ పరిసరాల్లోకి చేరిన వర్షపు నీరేనని వారు వివరించారు. సంగారెడ్డి–నాందేడ్ జాతీయ రహదారి నిర్మాణం అనంతరం రోడ్డు పక్కన ఉన్న వరద కాలువ పూడిపోవడంతో వర్షపు నీరు దిగువకు వెళ్లలేక పరిశ్రమలోకి చేరుతోందని పేర్కొన్నారు. అనంతరం ఆ నీటినే పంపింగ్ ద్వారా బయటకు పంపుతున్నామని తెలిపారు.పరిశ్రమలో ఉత్పత్తి ప్రక్రియలో ఏర్పడే వ్యర్థ జలాలను ఈటీపీలో పూర్తిగా శుద్ధి చేస్తున్నామని, కొంత భాగాన్ని ట్యాంకర్ల ద్వారా ప్రత్యేక శుద్ధి కేంద్రానికి తరలిస్తున్నామని కార్మికులు చెప్పారు. పరిశ్రమపై జరుగుతున్న తప్పుడు ప్రచారం వల్ల తమ ఉపాధికి ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.గత 30 సంవత్సరాలుగా శివంపేట గ్రామానికి చెందిన వందలాది మంది ఈ పరిశ్రమలో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గడంతో నెలలో 20 నుంచి 25 రోజులే పని దొరుకుతోందని, పరిశ్రమ మూతపడితే తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఉపాధి, భద్రతకు భరోసా కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ కొత్తగడి సంధ్యరాణి భర్త మల్లికార్జున్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియా ప్రతినిధులను పరిశ్రమ సమీపానికి తీసుకెళ్లి, వర్షపు నీటిని పంపింగ్ చేస్తున్న ప్రాంతాన్ని చూపించి తమ వాదనను వివరించారు.
Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News