ఈవీఎం గోదాం తరలింపునకు ప్రత్యామ్నాయ వసతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ సమీపంలో ప్రస్తుతం ఉన్న ఈవీఎం గోదాం జాతీయ రహదారి-167 కే నిర్మాణ పనుల పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో, ఈవీఎం గోదాంను నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డుకు తరలించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ భవన వసతులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. అదనపు కలెక్టర్ బి. చేన్నయ్య, నాగర్‌కర్నూల్ ఆర్డీఓ అర్చనలతో కలిసి కలెక్టర్ నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు.ఈ సందర్భంగా నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈవీఎం గోదాం ఏర్పాటుకు అనువైన గదులను పరిశీలించిన జిల్లా కలెక్టర్, గోదాం తరలింపునకు అవసరమైన తాత్కాలిక ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.నూతన ఈవీఎం గోదాం నిర్మాణం పూర్తయ్యే వరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) భద్రత, రక్షణ, నిల్వకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర భద్రతాపరమైన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. ఈవీఎం గోదాం తరలింపు ప్రక్రియను చేపట్టే ముందు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల నుంచి నిబంధనల ప్రకారం అవసరమైన అనుమతులు తప్పనిసరిగా పొందాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత అనుమతులు లభించిన అనంతరమే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాం తరలింపు చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరిండెంట్ రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


