పండుగ సాయన్న స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి
ట్యాంక్ బండ్ పై పండుగ సాయన్న విగ్రహానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే, నాగర్ కర్నూల్
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ పట్టణంలోని కేసరి సముద్రం ట్యాంక్ బండ్ పై పండుగ సాయన్న విగ్రహ స్థాపనకు సోమవారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మత్స్యకారుల సహకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పండుగ సాయన్న బడుగు బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. ముదిరాజ్ బిడ్డగా పుట్టి సామాజిక న్యాయం కోసం పోరాడిన ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ముదిరాజులకు, బడుగు బలహీన వర్గాలకు, మత్స్యకార సోదరులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు.
నాగర్ కర్నూల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని, కేసరి సముద్రం ట్యాంక్ బండ్ ను మరింత అందంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున, అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, ఆ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి ప్రముఖ నాయకులను ఆహ్వానిస్తామని తెలిపారు. మత్స్యకార సంఘానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షులు, నాయకులు, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మత్స్యకార సోదరులు, జిల్లా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


