జర్నలిస్టుల హక్కుల కోసం
అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున దేశవ్యాప్త నిరసనలు: టి యు డబ్ల్యూ జె
నల్గొండ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు డిమాండ్స్ లేఖ-కేంద్ర,రాష్ట్ర మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యేలు,కలెక్టర్లకు మెమోరాండాలు
నూతన మీడియా కమిషన్ ఏర్పాటు,జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) పిలుపులో భాగంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం"డిమాండ్స్ డే"పాటించనున్నట్లు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.విరాహత్ అలీ,కె.రాంనారాయణ తెలిపారు. కర్ణాటకలోని బెంగళూరులో ఇటీవల జరిగిన ఐజేయు జాతీయ కార్యవర్గ (ఎన్ ఈ సి) సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నిరసనలు చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు.ఇందులో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు తెలిపి,అనంతరం కలెక్టర్లకు,ఎంపీలు, మంత్రులు,ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేయాలని జిల్లా బాధ్యులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
రాష్ట్రపతికి ఇచ్చే ప్రధాన డిమాండ్లు:
దేశవ్యాప్త డిమాండ్ల దినోత్సవంలో భాగంగా పత్రికా స్వేచ్ఛను,మీడియా కార్మికుల సామాజిక-ఆర్థిక భద్రతను కాపాడేందుకు కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి,రాష్ట్ర ముఖ్యమంత్రులకు వినతిపత్రం పంపనున్నట్లు తెలిపారు.ప్రధాన డిమాండ్లు
నూతన మీడియా కమిషన్ ఏర్పాటు:
చివరి పత్రికా కమిషన్ 1982లో నివేదిక ఇచ్చింది.ఇప్పుడు బ్రాడ్ కాస్ట్ టెలివిజన్, ఆన్ లైన్ పోర్టల్స్, సోషల్ మీడియా విపరీతంగా పెరిగాయి. యాజమాన్య కేంద్రీకరణ, డిజిటల్ మానిటైజేషన్, నైతికతను పరిశీలించేందుకు కొత్త మీడియా కమిషన్ వేయాలి. జర్నలిస్టుల భద్రతకు జాతీయ చట్టం: దేశవ్యాప్తంగా జర్నలిస్టులు శారీరక హింస, అక్రమ కేసులు, డిజిటల్ వేధింపులు ఎదుర్కొంటున్నారు. భయం లేకుండా విధులు నిర్వర్తించేలా ప్రత్యేక కేంద్ర చట్టం తేవాలి.
రద్దు చేసిన వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాల పునరుద్ధరణ:
1955వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టం, 1958 వేజెస్ చట్టాల స్థానంలో కొత్త లేబర్ కోడ్ లు తేవడంతో ఉద్యోగ భద్రత, ఫిర్యాదుల పరిష్కారం బలహీనపడ్డాయి. పాత చట్టబద్ధ హక్కులను పునరుద్ధరించాలి.
నూతన వేజ్ బోర్డు ఏర్పాటు:
2007లో మజీతియా వేజ్ బోర్డు తర్వాత 20 ఏళ్లుగా వేతన సవరణ లేదు.ప్రింట్, ఎలక్ట్రానిక్,డిజిటల్ మీడియా అందరికీ వర్తించేలా కొత్త వేజ్ బోర్డు వేయాలి. ఇళ్ల స్థలాలు,ఇళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లు,ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. హెల్త్ కార్డులు ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డులు ఇచ్చి క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ కల్పించాలి.అక్టోబర్ 2న జరిగే డిమాండ్స్ డే లో అన్ని జిల్లాల్లోని పాత్రికేయ సంఘాలు, ప్రెస్ క్లబ్ లు, పౌర సమాజం పాల్గొని విజయవంతం చేయాలని టి యు డబ్ల్యూ జే విజ్ఞప్తి చేసింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


