ప్రతి ఒక్కరు మహిళల పట్ల గౌరవం తో వ్యవహరించాలి 

స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించిన భరోసా కోఆర్డినేటర్ సౌమ్య 

ప్రతి ఒక్కరు మహిళల పట్ల గౌరవం తో వ్యవహరించాలి 

మెదక్ :  మహిళల పట్ల గౌరవం అనేది మాటల్లోనే కాకుండా మన ఆలోచనలు, చేతల్లోనూ కనిపించాలని మెదక్ భరోసా కేంద్రం కోఆర్డినేటర్ సౌమ్య విద్యార్థులకు సూచించారు. మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు రామాయంపేటలోని స్నేహ కళాశాలలో ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
 ఈ సందర్భంగా భరోసా కోఆర్డినేటర్ సౌమ్య మాట్లాడుతూ.. ఆడపిల్లలు అనే కారణంతో ఎవరినీ తక్కువగా చూడకూడదని, మహిళలకు పురుషులతో సమానంగా గౌరవం, అవకాశాలు కల్పించాలని అన్నారు. కుటుంబంలోనూ, సమాజంలోనూ బాధ్యతలను సమానంగా పంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు. మహిళలను కించపరిచే జోకులు, వ్యాఖ్యలు సరదా పేరుతో చేసినప్పటికీ అవి ఇతరులను బాధపెడతాయని, అలాంటి ప్రవర్తనకు దూరంగా ఉండాలని సూచించారు.
 సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్‌లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఇతరుల వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని తెలిపారు. డిజిటల్ వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా మహిళలపై వేధింపులు లేదా అనుచిత ప్రవర్తన కనిపిస్తే మౌనంగా ఉండకుండా, తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధితులకు అండగా నిలవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
 అదేవిధంగా భరోసా కేంద్రం ద్వారా మహిళలు, బాలికలకు అందించే సహాయ సేవలు, అత్యవసర సహాయ నంబర్లు 112, 1098 గురించి వివరించారు. పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం–2006, వాటి ఉల్లంఘనకు సంబంధించిన చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. యుక్తవయస్సులో కలిగే ఆకర్షణలు, భావోద్వేగాలు, వాటిని అర్థం చేసుకుంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని వివరించారు.
 ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు , భరోసా సిబ్బంది పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News