విద్యార్థులపై లాఠీచార్జీని ఖండిస్తూ ఏఐవైఎఫ్ నిరసన
ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని, విద్యార్థులకు కేంద్రం క్షమాపణ చెప్పాలని డిమాండ్
కొత్తగూడెం, జూలై 23: న్యూఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద "చలో పార్లమెంట్" కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని ఖండిస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రామవరంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన హక్కుగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను అడ్డుకునేందుకు ఇనుప బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, మెట్రో స్టేషన్లను మూసివేయడం, భారీగా పోలీసు బలగాలను మోహరించి విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం పోలీసు బలప్రయోగానికి పాల్పడటం నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు. ఎన్‌టీఏలో చోటుచేసుకున్న అవినీతి, పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపం, వరుస పరీక్షా కుంభకోణాలపై దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ఈ అంశాలపై రాజకీయ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేయాలని లేదా కేంద్ర ప్రభుత్వం ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను నేరస్థులుగా చూడడం మానుకోవాలని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అణచివేసే చర్యలను ఏఐవైఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. పారదర్శకమైన పరీక్షా వ్యవస్థ, ఎన్‌టీఏలో సమగ్ర సంస్కరణలు అమలు చేసి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, నిర్బంధించిన వారిని విడుదల చేయాలని, లాఠీచార్జీకి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థి సంఘాలతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఖయ్యుమ్, జావీద్, కోచ్చెర్ల రాకేష్, రసూల్, ప్రసాద్, కొయ్యడ రవి, శివ, బాబా, యాకుబ్ పాషా, చిన్ను, బాలు, చంటి, సతీష్, వంశీ, ఇస్మాయిల్, శేఖర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Views: 21
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
