ప్రమాదాలలో ప్రాణ నష్టాన్నీ తగ్గించడం లక్ష్యం. అరైవ్ అలైవ్ 2.0 లో భాగంగా శిక్షణ
జిల్లా లో 20% ప్రమాదాల మరణాలను తగ్గించేందుకు కృషి ----- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

ఆదిలాబాద్ : అరవై అలైవ్ లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో జరుగు రోడ్డు ప్రమాదాలలో ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ సమగ్ర కార్యాచరణ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రమాదం జరిగిన మొదటి “గోల్డెన్ అవర్” అత్యంత కీలకమని, ఆ సమయంలో సరైన ప్రథమ చికిత్స అందితే అనేక ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే “చెక్ – కాల్ – కేర్” విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ముందుగా బాధితుడి శ్వాస, స్పందన, గాయాల తీవ్రతను చెక్ చేయాలి. వెంటనే డయల్ 100 లేదా అత్యవసర సేవలకు కాల్ చేయాలి. ఆపై అంబులెన్స్ వచ్చే వరకు సీపీఆర్, రక్తస్రావం నియంత్రణ, బాధితుడిని సురక్షిత స్థితిలో ఉంచడం వంటి చర్యల ద్వారా కేర్ చేయాలని వివరించారు.
ప్రమాదాలు జరిగిన సందర్భంలో వెంటనే స్పందించి పోలీసు వ్యవస్థ ద్వారా నిర్వహించబడుతున్న డయల్ 100, బ్లూ కోల్ట్, పెట్రో కార్, హైవే మొబైల్, స్పెషల్ పార్టీ సిబ్బందికి సీపీఆర్ కార్డియో పలమనారి రిససిటెషన్ పై ప్రాక్టికల్ శిక్షణ అందించనున్నారు. అదనంగా “బేసిక్ ట్రామా లైఫ్ సపోర్ట్” అంశంపై 2 రోజుల సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో ప్రమాదం సంభవించిన వ్యక్తి ని, గాయపడిన వారిని జాగ్రత్తగా తరలించడం, రక్తస్రావాన్ని ఆపే విధానాలు శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో తక్షణ చర్యలుమెడ, వెన్నెముక గాయాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన శిక్షణను అందించనున్నారు.
ఈ శిక్షణ కార్యక్రమాన్ని న్యూఢిల్లీకి చెందిన నిష్ణాతులైన “సేవ్ లైఫ్ ఫౌండేషన్” నిపుణులు నిర్వహిస్తున్నారు. ప్రాక్టికల్ డెమోస్, మానికిన్ల సహాయంతో సీపీఆర్ అభ్యాసం, అత్యవసర పరిస్థితుల్లో మానసిక ధైర్యం కల్పించే పద్ధతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల విశ్లేషణ ఆధారంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ రోడ్డు ఇంజనీరింగ్ సమస్యలు పరిష్కరించడం, పటిష్టమైన పహారా, స్పీడ్ చెకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, ఆటో డ్రైవర్లు, లారీ యూనియన్లు, యువజన సంఘాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి "అరైవ్ అలైవ్ 2.0" లో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రమాదాల వల్ల సంభవించే మరణాలను కనీసం 20 శాతం వరకు తగ్గించడమే లక్ష్యంగా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజలు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అధిక వేగం వద్ద వాహనం నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు శాఖ చేపడుతున్న ఈ కార్యక్రమాలకు ప్రజల సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవ్ లైఫ్ ఫౌండేషన్ అధికారులు కిషన్ సింగ్, నూర్ కేతర్బాల్, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, సిఐ లు బి సునీల్ కుమార్, కె ఫణిదర్, ప్రేమ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


