ఖానాపూర్ గ్రామంలో భూముల రీ సర్వే పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా సర్వే సిబ్బందితో రీ సర్వే పురోగతి గురించి ఆరా తీశారు. రైతులతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే రీ సర్వే లక్ష్యమని, భూముల హద్దుల నిర్ధారణ, రికార్డుల స్పష్టతకు ఇది ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు.
2,525 ఎకరాల రీ సర్వే
ఖానాపూర్ పరిధిలో 2,525 ఎకరాల 15 గుంటల భూములకు రీ సర్వే చేస్తున్నట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. ప్రభుత్వ, అటవీ, పట్టా భూములను సమగ్రంగా సర్వే చేసి, ఆన్ లైన్ లో మ్యాపుల నమోదు చేస్తున్నామని తెలిపారు. రీ సర్వేలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తదనంతరం ఖానాపూర్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలో 124 మంది విద్యార్థులు చదువుతున్నారని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. భవనం శిథిలావస్థలో ఉందని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, నూతన భవనం లేదా అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ స్థలాన్ని పరిశీలించి, విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంబడి తహసీల్దార్ మునీరుద్దీన్, ఎంపీడీవో కథలప్ప , సర్పంచ్ ఇందిర, హెచ్ ఎం రాజారెడ్డి తదితరులు ఉన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


