బీసీలకు 20 వేల కోట్ల హామీ ఏమైంది?
2వేల కోట్లతో సరిపెడతారా? ఇది బీసీలకు తీరని అన్యాయం - ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ధ్వజం
బిజినేపల్లి(నాగర్ కర్నూల్):తెలంగాణలో బీసీలను ఈ ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తోందని, బీసీలకు 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఎన్నికల ముందు గొప్పగా హామీ ఇచ్చి, ఇప్పుడు బడ్జెట్ లో కేవలం రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకోవడం దారుణమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రెండు వేల కోట్లు బీసీల అభివృద్ధికి ఏ మాత్రం సరిపోవని, నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే కురుమూర్తి జాతరకు వచ్చే బిచ్చగాళ్లకు పంచినా కూడా సరిపోవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ రాజ్యాధికార పాదయాత్రతో హోరెత్తిన బిజినేపల్లి:బీసీ రాజ్యాధికార పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బిజినేపల్లి మండల కేంద్రానికి విచ్చేశారు. ముందుగా మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి, బీసీల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక బహుజన నాయకులు, కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వ డ్రామా:పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతామని అసెంబ్లీ సాక్షిగా బిల్లు పెట్టి, గొప్పగా డ్రామాలాడారని ఎద్దేవా చేశారు. అటు అసెంబ్లీలో బిల్లు పెట్టి, ఇటు తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల చేత దొడ్డిదారిన హైకోర్టులో కేసు వేయించి, రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇది ముమ్మాటికీ బీసీలను మోసం చేయడమేనని అన్నారు. బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు తమ పోరాటం ఆగదని, ఈ పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బహుజన నాయకులు అంతటి రాజేందర్ గౌడ్, దాసర్ల.వెంకటస్వామి, వేముల సత్యశిలాసాగర్, మంగి విజయ్, తదితర బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


