అంబేడ్కర్ విగ్రహాన్ని తరలిస్తే భూపాలపల్లిలో భూకంపమే!
అశాస్త్రీయ రోడ్డు విస్తరణ నిర్ణయాలను విరమించుకోవాలి అంబేడ్కర్ సెంటర్‌గా కొనసాగించాలి
భూపాలపల్లి : పట్టణ అభివృద్ధి పేరుతో భూపాలపల్లిలో చేపడుతున్న అశాస్త్రీయ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా భూపాలపల్లి పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించాలనే ఆలోచనను సంబంధిత అధికారులు, పాలకులు తక్షణమే విరమించుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ రాదండి దేవేందర్ డిమాండ్ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని తరలించడం అంటే కేవలం ఒక విగ్రహాన్ని ఒకచోటు నుంచి మరోచోటుకు మార్చడం కాదని, యావత్ బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజ ఆత్మగౌరవాన్ని, సామాజిక న్యాయ ఆకాంక్షలను అవమానించడమేనని వారు పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆశయాలు కోట్లాది ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని, అలాంటి మహనీయుడి విగ్రహం విషయంలో అధికారులు, పాలకులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రోడ్ల విస్తరణ, పట్టణ అభివృద్ధి అవసరమే అయినప్పటికీ, ఆ పేరుతో ప్రజల చారిత్రక, సామాజిక గుర్తింపులను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. రోడ్డు విస్తరణకు సంబంధించి అధికారులు ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించి, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అభివృద్ధి అందరికీ ఉపయోగపడేలా ఉండాలి తప్ప, ఒక వర్గం ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదని అన్నారు.భూపాలపల్లిలో సర్కిల్ నిర్మాణం చేపట్టాలని అధికారులు, పాలకులు భావిస్తే, ఆ సర్కిల్ మధ్యలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహమే కొనసాగాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ డిమాండ్ చేసింది. ఇంతకాలంగా అంబేడ్కర్ సెంటర్‌గా గుర్తింపు పొందిన ఆ ప్రాంతాన్ని అదే పేరుతో, అదే గౌరవంతో కొనసాగించాలని కోరారు. విగ్రహాన్ని తరలించాలనే ప్రతిపాదనను పునఃపరిశీలించి, తరలింపు ఆలోచనకు స్వస్తి పలకాలని మున్సిపల్ కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులను కోరింది.అంబేడ్కర్ విగ్రహాన్ని తరలించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిసినా, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కొందరు నాయకులు స్పందించకపోవడం విచారకరమని జేఏసీ విమర్శించింది. సామాజిక ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాల్లో వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికింది. అంబేడ్కర్ ఆశయాలను గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ అంశంపై తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరింది. అంబేడ్కర్ విగ్రహాన్ని తరలిస్తే ప్రజాస్వామ్యబద్ధమైన ప్రజా ఉద్యమం మరింత ఉధృతమవుతుందని, అది పట్టణంలో పెద్ద ఎత్తున సామాజిక చైతన్యానికి దారితీస్తుందని జేఏసీ నాయకులు హెచ్చరించారు.విగ్రహ పరిరక్షణ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ మేధావులు, విద్యార్థులు, యువకులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అంబేడ్కర్ విగ్రహాన్ని కాపాడుకోవడం అంటే ఒక విగ్రహాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదని, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ విలువలను కాపాడుకోవడమని వారు పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


