వ్యవసాయం చేయకపోతే బతికేదెలా?
రైతులను ఆదుకోండి.. రైతాంగాన్ని కాపాడండి ఎల్ నినో పేరుతో రైతులను భయపెట్టడం సరికాదు ఎకరానికి రూ.40 వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందించాలి బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏరుకొండ అబ్బయ్య
నల్గొండ/మర్రిగూడ:రాష్ట్రంలో అన్నదాతలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, సాగుకు దూరంగా ఉండమని కోరడం కాకుండా రైతాంగాన్ని ఆదుకోవడానికి తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏరుకొండ అబ్బయ్య డిమాండ్ చేశారు. గురువారం నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎల్ నినో ప్రభావం ఉందనే పేరుతో రైతులు పంటలు సాగు చేయవద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలు చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "రైతులు వ్యవసాయం చేయకుండా మానుకుంటే వాళ్లు ఎలా జీవనం సాగించాలి? వారి కుటుంబాలు ఏమైపోవాలి?" అని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల పేరు చెప్పి అన్నదాతల మనోధైర్యాన్ని దెబ్బతీయడం ఏమాత్రం తగదని హితవు పలికారు.సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న ప్రతి రైతుకు ఎకరానికి రూ. 40 వేల చొప్పున పరిహారంగా ఆర్థిక సహాయం అందించాలని,గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం తరహాలోనే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అర్హులైన ప్రతి రైతు బ్యాంక్ ఖాతాలోనూ నగదును జమ చేయాలని,పంటలు వేయవద్దని హెచ్చరికలు జారీ చేయడం కంటే, రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే ప్రత్యామ్నాయ నీటి పారుదల, పంటల మార్పిడి ప్రణాళికలను సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు.దేశానికి వెన్నెముకగా నిలిచే రైతన్నలకు కష్టం వస్తే అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. వెంటనే క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టి, బాధితులకు తగిన భరోసా కల్పించాలని కోరారు. "రైతులను ఆదుకోండి.. రైతాంగాన్ని కాపాడండి" అని ఆయన ఈ సందర్భంగా నినాదాలు చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


