మొదటి రోజే రణరంగంగా మారిన రాయలసీమ..!!

- ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ..
- వైసీపీ కార్యాలయంతో పాటు 10 కార్లకు నిప్పు పెట్టిన దుండగులు..
కడప : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దశ నుంచి ఫలితాల వరకు మొత్తం ప్రక్రియ ప్రశాంతంగా, అంతరాయం లేకుండా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల సంఘం పలు సూచనలు చేస్తున్నప్పటికీ రాయలసీమ ప్రాంతం మాత్రం మొదటిరోజు నుండే రాజకీయ ఘర్షణలతో అట్టుడుకుతొంది. అన్నమయ్య జిల్లా పుంగనూరులో నామినేషన్ల ప్రారంభం రోజునే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడులు జరిగాయి. రాళ్ల దాడిలో రెండు వైపులా కార్యకర్తలకు గాయాలయ్యాయి. కార్లు ధ్వంసం అయ్యాయి. పోలీసులు రెండు వర్గాల వారిని చెదరగొట్టారు.
వైసీపీ అభ్యర్దులకు మద్దతుగా నామినేషన్ కేంద్రం వద్దకు ఎంపీ మిథున్ రెడ్డి రాగానే ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వైసీపీ నేతలను టీడీపీ వర్గీయులు అడ్డుకోవడానికి యత్నించటంతో రెండు పార్టీల కేడర్ మధ్య ఒక్క సారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. మిథున్ రెడ్డి వాహనం పైన రాళ్ల దాడి జరుగగా, ఆయనకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. మిథున్ రెడ్డిని అధికారులు నామినేషన్ కేంద్రంలో ఒక గదిలో ఉంచగా ఆ గదిలోకి చొరబడటానికి టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. దాదాపు గంట సేపుగా నామినేషన్ కేంద్రంగానే మిథున్ రెడ్డి ఉన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి, పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. మూడుసార్లు ఎంపీ గా గెలిచిన ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్ లో వైసీపీ ప్రతిపక్ష నాయకుడిగా వున్నారు.
మరోవైపు కడప జిల్లా రాయచోటి లోను ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎం.ఎల్.ఏ శ్రీకాంత్ రెడ్డి రాయచోటి లో ప్రెస్ మీట్ పెట్టిన కొద్దిసేపటికే అక్కడ వైసిపి కార్యాలయం బయట ఆగి వున్న దాదాపు 10 కార్లతో పాటు వైసిపి కార్యాలయాన్ని దుండగులు పూర్తిగా తగులబెట్టారు. ఆ సమయంలో మాజీ ఎం.ఎల్.ఏ శ్రీకాంత్ రెడ్డి కార్యాలయం లోనే వున్నారు. దీంతో వైసిపి మరియు టిడిపి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


