రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి
-- సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి -- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
స్టేషన్ ఘన్పూర్: ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం స్టేషన్ ఘన్పూర్ మండలం శివునిపల్లి గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్నినో ప్రభావం, పంటల మార్పిడిపై అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ 16 నాటికి జిల్లాలో సాధారణ వర్షపాతం 800 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 520 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైందని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు బదులుగా శనగ, కంది, పెసర, నూనెగింజల వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. బోర్లు, బావుల్లో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. బత్తాయి, కొబ్బరి, జామ, సీతాఫలం వంటి ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను అర్హులైన రైతులు వినియోగించుకోవాలని అన్నారు. డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలకు అర్హతను బట్టి 80 నుంచి 90 శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నట్లు వివరించారు. కూరగాయలు, ఆకుకూరల సాగుతో రైతులు నిరంతర ఆదాయం పొందవచ్చని, మహిళా రైతులు కూడా ఈ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, మహిళా శక్తి రైతు సేవా కేంద్రాల ద్వారా వ్యవసాయ ఉత్పాదకాలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. రైతుల సమస్యలను సంబంధిత అధికారులు తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, ఏడీఏ అపర్ణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మురళీధర్ రావు, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, ఏసీపీ భీం శర్మ, ఎంపీడీఓ విజయశ్రీ వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


