సర్వీస్ రిజిస్టర్లలో తప్పులకు బాధ్యులెవరు?
నాలుగున్నర లక్షల మంది ఉద్యోగుల ఎస్ఆర్లలో లోపాలు! డీడీవోల నిర్లక్ష్యంతో ఉద్యోగుల భవిష్యత్తుకు ముప్పు? డిజిటలైజేషన్ గడువులోపు లోపాలను సరిచేయాలి రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాసరెడ్డి
అక్టోబర్ : రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులకు సంబంధించిన సుమారు నాలుగున్నర లక్షల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అనేక లోపాలు వెలుగులోకి వస్తున్నాయని రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కీలకమైన ఎంట్రీలు నమోదు కాకపోవడం, అసంపూర్ణ వివరాలు, తప్పుల నమోదుతో ఉద్యోగులు భవిష్యత్తులో పదోన్నతులు, వేతన స్థిరీకరణ, పదవీ విరమణ ప్రయోజనాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.పూర్వ, ప్రస్తుత డీడీవోలదే బాధ్యత సర్వీస్ రిజిస్టర్ అనేది ఉద్యోగి ఉద్యోగ జీవితానికి సంబంధించిన అత్యంత కీలకమైన అధికారిక పత్రమని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇందులోని ప్రతి ఎంట్రీ ఉద్యోగి సర్వీసు ప్రయోజనాలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఉద్యోగి బదిలీపై కొత్త కార్యాలయం లేదా పాఠశాలకు వెళ్లినప్పుడు సర్వీస్ రిజిస్టర్ను క్షుణ్ణంగా పరిశీలించి, ఎంట్రీల్లో లోపాలుంటే వాటిని సరిచేయించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని వివరించారు.ఫండమెంటల్ రూల్స్లోని సంబంధిత నిబంధనలను అమలు చేస్తూ సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదని కోరారు. పూర్వ డీడీవోలు ఎంట్రీలు నమోదు చేయకపోవడం, ప్రస్తుత డీడీవోలు వాటిని సరిగా పరిశీలించకపోవడం వల్ల ఉద్యోగులు నష్టపోకూడదని స్పష్టం చేశారు. మంజూరైన ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేలు నమోదు చేయలేదు! 2023లో ఒక ఉపాధ్యాయుడికి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేలు మంజూరైనా, అప్పటి డీడీవో సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయలేదు. 2024లో ఆ ఉపాధ్యాయుడు మరో పాఠశాలకు బదిలీ కాగా, ప్రస్తుతం జరుగుతున్న డిజిటలైజేషన్లో ఈ లోపం బయటపడింది. బదిలీ సమయంలోనే సర్వీస్ రిజిస్టర్ను పరిశీలించి ఉంటే ఈ సమస్య ముందుగానే గుర్తించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.ఇలాంటి సందర్భాల్లో బాధ్యతను సంబంధిత రికార్డులు, నిబంధనల ఆధారంగా నిర్ధారించి, తప్పిదాలకు కారణమైన అధికారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో బాధిత ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు ఆలస్యం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.డిజిటలైజేషన్ పూర్తయ్యేలోపు సరిదిద్దాలిప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ను పూర్తి చేయడంతోపాటు, అసంపూర్ణంగా ఉన్న వివరాలు, మిస్సైన ఎంట్రీలు, తప్పుగా నమోదైన సమాచారాన్ని కూడా సరిచేయాలని శ్రీనివాసరెడ్డి కోరారు. ప్రతి డీడీవో తన పరిధిలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్లను పునఃపరిశీలించి, సంబంధిత ఆధారాలతో అవసరమైన సవరణలు చేయించాలని విజ్ఞప్తి చేశారు.సర్వీస్ రిజిస్టర్లలోని లోపాల కారణంగా ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, వేతన ప్రయోజనాలు, పదవీ విరమణ ప్రయోజనాలు కోల్పోయే పరిస్థితి రాకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సర్వీసు రికార్డుల విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, నిర్లక్ష్యం నిర్ధారణ అయిన సందర్భాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఎడబోయిన శ్రీనివాసరెడ్డి కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


