తెలుగు ఉపాధ్యాయులను వెంటనే నియమించాలి: కలెక్టర్‌కు విజ్ఞప్తి
నల్లబెల్లి,(వరంగల్ జిల్లా):మండలంలోని నందిగామ, నారక్కపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో తెలుగు బోధించే ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని కోరుతూ తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి, సామాజిక ఉద్యమ నేత బట్టు సాంబయ్య, ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు, దళిత రత్న అవార్డు గ్రహీత పరికిరత్నం మాదిగ గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు నల్లబెల్లి సబ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా రిజిస్టర్ పోస్టులో విజ్ఞాపన పత్రం పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....... నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు బోధించే ఉపాధ్యాయుడు లేకపోవడంతో పదో తరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అదేవిధంగా నారక్కపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా తెలుగు ఉపాధ్యాయులు లేకపోవడం బాధాకరమన్నారు. మార్చిలో పదో తరగతి బోర్డు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు తెలుగు సబ్జెక్టులో ఇబ్బందులు ఎదుర్కొని ఫలితాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, అవసరమైన పాఠశాలలకు ఇతర పాఠశాలల నుంచి తెలుగు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై నియమించాలని కోరారు. విద్యార్థుల విద్యా హక్కు, భవిష్యత్తును కాపాడేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెంతల మహేందర్‌రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


