జీతాల పెంపు హామీని నెరవేర్చాలి
కంపెనీ ఎదుట కార్మికుల నిరసన
చౌటకూర్, సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీ డిక్షనరీ కంపెనీ యాజమాన్యం తమకు ఇచ్చిన వేతన పెంపు హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు గురువారం కంపెనీ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. పెరిగిన జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచుతామని గత మూడు నెలల క్రితమే యాజమాన్యం హామీ ఇచ్చిందని తెలిపారు. ఆగస్టు నాటికే పెంచిన వేతనాలు చెల్లిస్తామని స్పష్టమైన భరోసా ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో నిరసనకు దిగాల్సి వచ్చిందని పేర్కొన్నారు.ఇచ్చిన హామీ మేరకు పెంచిన వేతనాలను తక్షణమే చెల్లించాలని, సమస్యను పరిష్కరించేంత వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. కార్మికుల నిరసనతో కంపెనీ వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికైనా కంపెనీ ఉన్నతాధికారులు స్పందించి చర్చలు జరపాలని కార్మికులు కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


