వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా, సామరస్యంగా జరుపుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్ (మంచిర్యాల): వినాయక చవితి పర్వదినాన్ని జిల్లాలో ప్రశాంత వాతావరణం, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో డి.సి.పి. ఎ. భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల మరమ్మతులు వంటి మౌలిక వసతులను కల్పించాలని సూచించారు. విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, ముందస్తు ప్రణాళికతో నిమజ్జనం సజావుగా సాగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. డి.సి.పి. అగ్గడి భాస్కర్ మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వేడుకలు నిర్వహించి పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మేయర్ ధరణి మధుకర్, వివిధ మున్సిపల్ చైర్మన్లు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

