నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ లు చేసుకున్న ఎంతటి వారైనా వదలం.: డీఎస్పీ జీవన్ రెడ్డి
- రాంపూర్-టి ల్యాండ్ గ్రాబింగ్ కేసులో కీలక అప్డేట్*
- నకిలీ వారసత్వ ధృవీకరణ పత్రంతో భూమి కబ్జాకు యత్నం*
- ఒకరోజు పోలీస్ కస్టడీలో కీలక వివరాలు వెలుగులోకి.. డాక్యుమెంట్ రైటర్ అరెస్ట్....
- ఆదిలాబాద్ డిఎస్పి ఎల్. జీవన్ రెడ్డి*
ఆదిలాబాద్ :ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్-టి గ్రామంలో నకిలీ పత్రాలు, తప్పుడు రిజిస్ట్రేషన్ల ద్వారా వారసత్వ వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు మహమ్మద్ ఇబ్రహీం అక్బానీ @ మామ్లా సేఠ్‌ను ఒకరోజు కస్టడీలోకి తీసుకుని విచారించగా, నకిలీ పత్రాల తయారీలో డాక్యుమెంట్ రైటర్ మహమ్మద్ పైజుద్దీన్ సిద్ధిఖీ @ సాహెర్ పాత్రపై కీలక వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా డాక్యుమెంట్ రైటర్ మహమ్మద్ పైజుద్దీన్ సిద్ధిఖీ @ సాహెర్‌ను బుధవారం అరెస్ట్ చేసి, గురువారం న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు జిల్లా జైలుకు తరలించినట్లు తెలిపారు. నకిలీ వారసత్వ ధృవీకరణ పత్రాలు, ఇతర పత్రాలను సృష్టించడంలో అతని పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు వివరించారు.
భూమి యజమాని సయ్యద్ సఫ్దర్ అలీ ఈ సంవత్సరం భూమికి సంబంధించిన వాల్యుయేషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయగా, తన పేరుపై ఉన్న భూమి ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డిఎస్పి తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మహేష్ కుమార్ ఖేతాన్ విచారించగా, మహమ్మద్ ఇబ్రహీం అక్బానీ @ మామ్లా సేఠ్, సూరజ్ సేఠ్ మధ్యవర్తులుగా వ్యవహరించి, నకిలీ పత్రాలు సృష్టించి భూమిపై అక్రమ హక్కులు సృష్టించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు.నకిలీ పత్రాల తయారీకి సహకరించిన డాక్యుమెంట్ రైటర్లు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పి తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు ముందు సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని డాక్యుమెంట్ రైటర్లు, రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బందికి సూచించారు.
ప్రజలు భూములు, ప్లాట్లు కొనుగోలు చేసే ముందు యాజమాన్య హక్కులు, వారసత్వ పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలు మరియు సంబంధిత రికార్డులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని సూచించారు.ల్యాండ్ గ్రాబర్స్ ఎంతటి వారైనా, ఎన్ని సంవత్సరాల క్రితం నకిలీ పత్రాలు సృష్టించినా చట్టపరమైన చర్యలు తప్పవని డిఎస్పి ఎల్. జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. నకిలీ పత్రాల ద్వారా భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఉట్ల గణపతికి వారసత్వ సర్టిఫికెట్ మంజూరు చేసిన రెవెన్యూ సిబ్బంది పాత్ర పై సైతం విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
ఆదిలాబాద్ పట్టణం మరియు జిల్లాలో బడా రియల్టర్ల మోసాలకు గురైన బాధితులు భయపడకుండా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని డిఎస్పి సూచించారు. బాధితులకు అండగా నిలిచి, వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ చట్ట ప్రకారం న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


