గణేష్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు
- చెరువుల వద్ద బేబీ పాండ్లు..
- క్రేన్లు, అంబులెన్సులు, ఫైర్ సేఫ్టీ సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశం
మల్కాజిగిరి : గణేష్ నిమజ్జనాన్ని సురక్షితంగా, సజావుగా, పర్యావరణహితంగా నిర్వహించేందుకు మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్, ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తాతో కలిసి బుధవారం రాంపల్లి లేక్, కాప్రా చెరువు, ఏదులాబాద్ లేక్, ఉప్పల్ నల్లచెరువు తదితర నిమజ్జన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
చిన్న విగ్రహాలకు ప్రత్యేక బేబీ పాండ్లు
పెద్ద విగ్రహాలతోపాటు చిన్న గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేకంగా బేబీ పాండ్లు ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు. రాంపల్లి, ఏదులాబాద్ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసే బేబీ పాండ్లను భవిష్యత్తులో బతుకమ్మ వేడుకలకు కూడా వినియోగించుకునేలా నిర్మించాలని సూచించారు. చిన్న, పెద్ద విగ్రహాలకు వేర్వేరు నిమజ్జన పాయింట్లు ఏర్పాటు చేసి రద్దీని నియంత్రించాలని ఆదేశించారు.
పూడిక తొలగింపు.. తాజా నీటితో నింపాలి
కాప్రా చెరువు, ఉప్పల్ నల్లచెరువు బేబీ పాండ్లను పూర్తిగా ఖాళీ చేసి పూడిక, మట్టిని తొలగించి శుభ్రపరిచిన అనంతరం తాజా నీటితో నింపాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల్లో పాత గణేష్ విగ్రహాలను వెంటనే తొలగించడంతోపాటు ఈ ఏడాది నిమజ్జనం చేసిన విగ్రహాలను కూడా సకాలంలో తొలగించాలని సూచించారు.
భద్రతకు పెద్దపీట
నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, వైద్య సిబ్బంది, అంబులెన్సులు, ఫైర్ సేఫ్టీ సదుపాయాలు, కంట్రోల్ రూమ్‌లు సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు. భక్తుల రాకపోకలకు అప్రోచ్ రోడ్లు, తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచి నిమజ్జనం జరిగే సమయంలో నిరంతరం పరిశుభ్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు.
పూజా సామగ్రికి ప్రత్యేక ఏర్పాట్లు
నిమజ్జన ప్రాంతాల్లో సేకరించే పూలు, ఇతర సేంద్రియ పూజా సామగ్రిని ప్రత్యేకంగా సేకరించి సహజ ఎరువుగా ప్రాసెస్ చేయాలని కమిషనర్ సూచించారు. ఇతర వ్యర్థాలను కూడా శాస్త్రీయ పద్ధతిలో సేకరించి తరలించాలని ఆదేశించారు.సహజ చెరువులపై నిమజ్జన భారం తగ్గించడం, జలవనరులను పరిరక్షించడం, భక్తుల భద్రతను కాపాడటమే లక్ష్యంగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా ప్రాంతాల డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, యూబీడీ, పారిశుద్ధ్య విభాగాల అధికారులు, రామ్‌కీ, ఈపీటీఆర్‌ఐ ప్రతినిధులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


