ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి :వనపర్తి జిల్లా కలెక్టర్
వనపర్తి : జిల్లాలోని ప్రతి గర్భిణికి సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి, రక్తహీనత (అనీమియా) సమస్య ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.గురువారం గోపాలపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. లేబర్ రూమ్‌లో ఉన్న సౌకర్యాలను తనిఖీ చేసి, గర్భిణులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.ఈడీడీ రిజిస్టర్‌ను పరిశీలించి, రాబోయే తొమ్మిది నెలల్లో ప్రసవించనున్నగర్భిణుల వివరాలు, వారికి నిర్వహిస్తున్నవైద్య పరీక్షలు,ప్రసవాలవివరాలు, రక్తహీనత సమస్యతో బాధపడుతున్న గర్భిణుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులను వెంటనే గుర్తించి వారికి పోషకాహారం, అవసరమైన మందులు అందించి ఆరోగ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. మాతా శిశు ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎంసీహెచ్ (MCH) పోర్టల్‌లో ఎప్పటికప్పుడు ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఆసుపత్రికి పరీక్షల కోసం వచ్చిన ఓ గర్భిణితో కలెక్టర్ మాట్లాడి, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, పరీక్షలు, మందుల పంపిణీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రిలో రోజువారీ ఓపీ వివరాలను పరిశీలించి, చికిత్స కోసం వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అదేవిధంగా ఆస్పత్రికి అత్యవసరంగా వచ్చే రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లేబర్ రూమ్‌లకు(డెలివరీ రూమ్) అవసరమైన మౌలిక వసతులు, పరికరాలు లేదా ఇతర అవసరాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, ఇతర వైద్యాధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


