రూ. 9 లక్షలు నొక్కి.. అడిగితే హత్య బెదిరింపులు
- నర్సింగి పీఎస్ పరిధిలో ఘరానా మోసం..
- పట్లోళ్ల రూపా రెడ్డిపై కేసు నమోదు
గండిపేట (రంగారెడ్డి): అత్యవసరంగా డబ్బు కావాలంటూ నమ్మబలికి లక్షలాది రూపాయలు వసూలు చేసి, తిరిగి అడిగినందుకు బాధితురాలిని బూతులు తిడుతూ, చంపేస్తామని బెదిరించిన ఘరానా మోసం నర్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.అత్యవసరం అని నమ్మించి.. పోలీసుల కథనం ప్రకారం.. నర్సింగి పీఎస్ పరిధిలోని తిరుమల హిల్స్‌కు చెందిన శ్రీమతి చింతపల్లి రాణికి, అదే ప్రాంతంలో నివాసముంటున్న పట్లోళ్ల రూపా రెడ్డితో పరిచయం ఉంది. 2021లో తనకు అత్యవసరంగా డబ్బు కావాలని రూపా రెడ్డి బాధితురాలిని ఆశ్రయించింది. కొద్ది నెలల్లోనే అసలు మొత్తంతో పాటు 30 శాతం అదనపు లాభం చెల్లిస్తానని నమ్మబలికి రూ. 9,00,000 తీసుకుంది.బౌన్స్ అయిన చెక్కులు.. ముఖం చాటేసిన నిందితురాలు గడువు పూర్తయిన తర్వాత రాణి పలుమార్లు తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా నిందితురాలు కాలయాపన చేస్తూ వచ్చింది. ఒత్తిడి పెరగడంతో ఒక బాండ్ పత్రంతో పాటు వివిధ బ్యాంకులకు చెందిన చెక్కులను ఇచ్చింది. బాధితురాలు అందులోని ఒక చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేయగా, ఖాతాలో తగినంత నిల్వ లేకపోవడంతో అది బౌన్స్ అయింది. మిగతా చెక్కులను కూడా బ్యాంకులో వేయవద్దని చెప్పిన రూపా రెడ్డి, ఆ తర్వాత బాధితురాలు చేసిన ఫోన్ కాల్స్‌కు స్పందించకుండా తప్పించుకు తిరగడం ప్రారంభించింది.ఇంటికి వెళ్తే దౌర్జన్యం.. చంపేస్తామని బెదిరింపులు తీవ్ర నిరాశకు గురైన బాధితురాలు రాణి, ఈనెల 5వ తేదీ ఉదయం 10:20 గంటల ప్రాంతంలో నేరుగా నిందితురాలి ఇంటికి వెళ్లారు. తన రూ. 9 లక్షలు తిరిగి ఇచ్చేయాలని నిలదీశారు. దీనికి ఆగ్రహించిన రూపా రెడ్డి డబ్బులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పడమే కాకుండా, బాధితురాలిని తీవ్ర పదజాలంతో దుర్భాషలాడింది. అంతటితో ఆగక ఇంటి నుంచి బయటకు నెట్టివేసి, తనతో ఉన్న కొందరు వ్యక్తులతో కలిసి 'మళ్లీ ఇటు వస్తే చంపేస్తాం' అని బహిరంగంగా బెదిరింపులకు దిగింది. బాధితురాలు చింతపల్లి రాణి నర్సింగి పోలీసులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితురాలు పట్లోళ్ల రూపా రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు నర్సింగి పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


