దౌల్తాబాద్ తాండాలో డెంగ్యూపై అప్రమత్తత చర్యలు
దౌల్తాబాద్, సిద్దిపేట : దౌల్తాబాద్ పరిధిలోని తాండాలో ఓ డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. డెంగ్యూ వ్యాప్తిని అరికట్టేందుకు సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో తక్షణ చర్యలు చేపట్టారు. డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తి నివాసంలో, అలాగే చుట్టుపక్కల ఇళ్లలో ప్రత్యేకంగా తిమోఫాస్ స్ప్రేయింగ్ నిర్వహించారు. అంతేకాకుండా తాండాలోని పలు ప్రాంతాల్లో నిల్వ నీటి వనరులను పరిశీలించి, దోమల లార్వా నివారణ చర్యలు చేపట్టారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా వైద్య సిబ్బంది గ్రామస్తులకు సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా ఇంటి పరిసరాల్లో ఉన్న పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, నీటి ట్యాంకులు, ఇతర పాత్రల్లో నీరు నిల్వ కాకుండా వారానికి ఒకసారి శుభ్రపరచాలని ప్రజలకు తెలియజేశారు. రాత్రి వేళల్లో దోమతెరలు, దోమల నివారణ క్రీములు ఉపయోగించాలని సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


