సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొనుగోలులో ఆధార్, పూర్తి వివరాలు తప్పనిసరి
రాజన్న సిరిసిల్ల,: సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాల్లో పారదర్శకత పాటిస్తూ విక్రేత ఆధార్ కార్డు, పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మొబైల్ షాపుల యజమానులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో జిల్లా పరిధిలోని మొబైల్ విక్రయ, రిపేర్ షాపుల యజమానులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను విక్రయించేందుకు, ఎక్స్చేంజ్ చేసేందుకు కొందరు ప్రయత్నించే అవకాశాలు ఉన్నందున వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. మొబైల్ విక్రయానికి వచ్చే ప్రతి వ్యక్తి నుంచి ఆధార్ కార్డు, చిరునామా, ఫోన్ నంబర్ తదితర పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా దొంగిలించిన మొబైల్ ఫోన్ల విక్రయానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. మొబైల్ దొంగలను పట్టించడంలో లేదా వారి ఆచూకీ అందించడంలో సహకరించే మొబైల్ షాపుల యజమానులను జిల్లా పోలీసుల తరఫున ప్రశంసాపత్రాలతో సత్కరిస్తామని తెలిపారు. సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసే వినియోగదారులు సంబంధిత షాపు నుంచి తప్పనిసరిగా బిల్లు లేదా రసీదు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. తక్కువ ధరకు లభిస్తుందనే ఆశతో దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, దొంగిలించిన మొబైల్ అని తెలిసి కూడా కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొబైల్ ఫోన్లను విక్రయించాలనుకునే వారు సంబంధిత కంపెనీల అధికారిక ఎక్స్చేంజ్ కేంద్రాలు లేదా చట్టబద్ధమైన విక్రయ సంస్థల ద్వారానే విక్రయించాలని, అనధికారిక వ్యక్తులు లేదా గుర్తింపు లేని షాపులకు విక్రయించవద్దని సూచించారు. దొంగిలించిన మొబైల్ ఫోన్లు సైబర్ నేరాలకు వినియోగించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ప్రజల సహకారంతోనే మొబైల్ ఫోన్ల రికవరీలో దక్షిణ భారతదేశంలో మొదటి స్థానం, తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మూడో ఏడాది మొదటి స్థానాన్ని జిల్లా సాధించిందని ఎస్పీ తెలిపారు. నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే CEIR పోర్టల్లో బ్లాక్ చేసి, సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఐటీ కోర్ ఎస్‌ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేష్‌తో పాటు జిల్లా పరిధిలోని పలువురు మొబైల్ షాపుల యజమానులు పాల్గొన్నారు.
Views: 12
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Jul 2026 00:48:51
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
