బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి, మొక్కజొన్న తదితర పంటలు కొన్నిచోట్ల మొలకెత్తకపోగా, ఇప్పటికే మొలకెత్తిన మొక్కలు కూడా ఎండ తీవ్రతకు నేలవాలుతున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి సాగు చేసిన పంటలు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు.ఈ నేపథ్యంలో శుక్రవారం మర్పల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో గ్రామ మహిళలు సంప్రదాయ పద్ధతిలో జలాభిషేకం నిర్వహించి వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నీటి బిందెలలో నీటిని తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తూ, "అమ్మా... వరుణుడిని కరుణింపజేయి... సమృద్ధిగా వర్షాలు కురిపించి రైతుల కష్టాలు తీర్చు" అంటూ భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించారు. మహిళలు మాట్లాడుతూ, రైతు జీవితమంతా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుందని, వరుసగా వర్షాలు లేకపోవడంతో రైతు కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల కోసం చేసిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారని పేర్కొన్నారు. "ఇకనైనా వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలి... పొలాలు పచ్చదనంతో కళకళలాడాలి... పంటలు సమృద్ధిగా పండాలి... రైతు ఇంట సిరిసంపదలు వెల్లివిరియాలి" అని పెద్దమ్మ తల్లిని వేడుకుంటూ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.జిల్లాలో ఇప్పటికే అనేక గ్రామాల్లో వర్షాభావం కారణంగా పంటలు ఎండిపోతుండగా, వర్షాల కోసం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు నిర్వహించడం గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్న పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది. రైతుల ఆవేదనను అర్థం చేసుకొని ప్రకృతి కరుణించాలని, వరుణుడు ప్రసన్నమై త్వరలోనే విస్తారంగా వర్షాలు కురిపించాలని గ్రామస్థులు, మహిళలు హృదయపూర్వకంగా ప్రార్థించారు.
Views: 84
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Jul 2026 18:28:46
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
