విఘ్నాలు తొలగి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
దౌల్తాబాద్,సిద్దిపేట: వినాయక నవరాత్రుల సందర్భంగా దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో వివేకానంద యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గణేష్ పంచమి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బొర్రోళ్ల స్వామి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బాలశేఖర్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో నాయకులు పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వినాయకుడి కృపతో ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగిపోవాలని ఆకాంక్షించారు. మండల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు వారు తెలిపారు. వినాయక నవరాత్రుల సందర్భంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంజా స్వామి, ఉప సర్పంచ్ ప్రేమ్ కుమార్,వివేకానంద యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


