పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
నిర్మల్ :గోదావరి పుష్కరాలకు బాసరకు వచ్చే భక్తులందరికీ అన్ని సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ బాసరలో పుష్కరాల పనులను సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల పార్కింగ్, వీఐపీ, వీవీఐపీ ల పార్కింగ్, హెలిప్యాడ్ నిర్మించనున్న ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనాల రాకపోకల సామర్థ్యానికి అనుగుణంగా పార్కింగ్ స్థలాలను ఆయా మార్గాలవారీగా ఏర్పాటు చేయాలన్నారు. ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలన్నారు. భక్తుల అవసరాల మేరకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. సంబంధిత అధికారులు అంతా పుష్కరాల పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. పనులన్నీ నాణ్యవంతంగా ఉండాలని చెప్పారు. అనంతరం నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఈఈ ఆర్ అండ్ బి సుభాష్, తహసీల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


