మంజీరా నది వద్ద టూరిజం పార్క్ ఏర్పాటు చేయాలి
చౌటకూర్ : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన యువ టూరిజం క్లబ్ పోటీల్లో చౌటకూర్ మండలంలోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వినూత్న ఆలోచనను ప్రదర్శించారు. పోటీల్లో భాగంగా ఇన్నోవేషన్ ఐడియా విభాగంలో జాతీయ రహదారి నంబర్ 161 పై శివంపేట సమీపంలోని మంజీరా నది రోడ్ కం బ్రిడ్జి వద్ద పర్యాటక అభివృద్ధి పార్కును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌తో పాటు పర్యాటక శాఖ అధికారులను విద్యార్థులు కోరారు. జాతీయ రహదారిపై నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుం డటంతో ప్రయాణికులకు ఈ ప్రాంతాన్ని విశ్రాంతి, విడిది కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని విద్యార్థులు వివరించారు. భవిష్యత్తులో రీజినల్ రింగ్ రోడ్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం మరింత కీలకమైన రహదారి కూడలిగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. సంగారెడ్డి వైపు వెళ్లే మార్గంతో పాటు హైదరాబాద్, నాందేడ్ వైపు వెళ్లే రహదారులకు సమీపంలో ఈ ప్రాంతం ఉండటం వల్ల పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని విద్యార్థులు తమ ప్రదర్శనలో వివరించారు. మంజీరా నది పరిసర ప్రాంతంలో పర్యాటక సౌకర్యాలు, పార్కు, సందర్శకులకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతానికి పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉందన్నారు. పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు పెరిగి హైదరాబాద్ వంటి నగరాలకు వలసలు వెళ్లే పరిస్థితులు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని విద్యార్థులు వివరించారు. ఈ వినూత్న ఆలోచనను టూరిజం క్లబ్ గైడ్ టీచర్ ఎన్. రాములు, సోషల్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించారు. కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిపాదనకు సంబంధించిన అంశాలను వివరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


