సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం
- వృద్ధులు నేటి సమాజానికి స్ఫూర్తి
- వృద్ధుల సంక్షేమం మనందరి బాధ్యత
- న్యాయమూర్తి బి.సౌజన్య
- జిల్లా కార్యదర్శి... న్యాయ సేవ అధికార సంస్థ సంగారెడ్డి జిల్లా
సంగారెడ్డి, :అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో వృద్ధుల సంక్షేమం, హక్కులు, రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి బి.సౌజన్య ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. వృద్ధులు సమాజానికి అందించిన సేవలు, అనుభవాలను గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని న్యాయమూర్తి బి.సౌజన్య అన్నారు. వృద్ధుల అనుభవాలను యువతకు మార్గదర్శకంగా ఉపయోగించుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు వృద్ధుల పట్ల ప్రేమ, గౌరవం,బాధ్యతతో వ్యవహరించాలని, వారిని ఒంటరితనానికి గురికాకుండా కుటుంబంలో భాగస్వాములుగా చూడాలని తెలిపారు. వృద్ధుల ఆరోగ్యం, భద్రత, సామాజిక భద్రతతో పాటు గౌరవప్రదమైన జీవనం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆస్తి వివాదాలు, కుటుంబ సమస్యలు లేదా ఇతర న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని తెలిపారు. అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని పేర్కొన్నారు. వృద్ధులపై నిర్లక్ష్యం, వేధింపులు లేదా హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు సంబంధిత అధికారులను సంప్రదించాలని సౌజన్య సూచించారు. వృద్ధుల పట్ల గౌరవం, సంరక్షణ, బాధ్యత ప్రతి కుటుంబ సభ్యుడి సామాజిక బాధ్యత అని అన్నారు. అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. వృద్ధులకు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకునేలా సంబంధిత శాఖలు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, డీఎంహెచ్‌ఓ డా. లలిత, డీఆర్‌డీఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధుల సమస్యలు, ఆరోగ్య పరిరక్షణ, సామాజిక భద్రత, న్యాయ హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చించారు. వృద్ధులు ఆరోగ్యంగా, సురక్షితంగా, గౌరవప్రదంగా జీవించేలా కుటుంబం, సమాజం, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


