కష్టపడి చదివితే ఉద్యోగం సాధించడం తథ్యం
- ఉచిత శిక్షణ పొందుతున్న 300 కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అంద జేసిన ఎస్పీ అఖిల్ మహాజన్
- ప్రతిరోజు బోధించిన అంశాలను సొంతంగా రివిజన్ చేసుకోవాలి
- పరీక్ష వరకు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచన
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆదిలాబాద్ డిటిసి కేంద్రంలో కానిస్టేబుల్, ఎస్సై ప్రాథమిక పరీక్షలకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణలో సుమారు 380 మంది అభ్యర్థులు ప్రతిరోజూ పాల్గొంటున్నారు. ఈ శిక్షణ గత నెల ఏడవ తారీఖున ప్రారంభమై 60 రోజులపాటు కొనసాగుతుంది. ఇందులో భాగంగా గురువారం ఆదిలాబాద్ డీటీసీ కేంద్రంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించి, అభ్యర్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కష్టపడి చదివితే ఉద్యోగం సాధించడం తథ్యమని, ప్రతి అభ్యర్థి లక్ష్యంపై దృష్టి సారించి క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. ప్రతిరోజూ తరగతుల్లో బోధించిన అంశాలను అదే రోజు సొంతంగా రివిజన్ చేసుకోవాలని తెలిపారు. పరీక్ష రాసే వరకు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ పరీక్షలకు అనుగుణంగా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ తదితర అంశాలతో రూపొందించిన నూతన స్టడీ మెటీరియల్‌ను తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో సుమారు 300 మంది అభ్యర్థులకు అందజేశారు. అభ్యర్థులు ఈ పుస్తకాలను సద్వినియోగం చేసుకుని ప్రాథమిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో చేరాలనే లక్ష్యంతో శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరూ పట్టుదల, క్రమశిక్షణ తో ముందుకు సాగాలని, రానున్న ప్రాథమిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన పి. మౌనిక ఐపీఎస్, ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు, ఆదిలాబాద్ రూరల్ ఎస్సై లు వి. విష్ణువర్ధన్, ప్రవీణ్, అపరాజిత ఇన్‌స్టిట్యూట్ అధ్యాపకుడు సాయి ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


