పోలీసు అభ్యర్థులు ఉచిత శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

పోలీసు అభ్యర్థులు ఉచిత శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

నిర్మల్ జిల్లా,  : పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు జిల్లా కేంద్రంలోనే పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఉచిత శిక్షణ అవకాశాన్ని ఉద్యోగార్థులు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. గురువారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా పోలీసు అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రారంభించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలీసు అభ్యర్థులకు ఉచిత భోజనంతో పాటు శిక్షణ అందిస్తున్న జిల్లా ఎస్పీ, పోలీసులకు, సహకరిస్తున్నవారికి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాదు లాంటి దూర ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగ శిక్షణ పొందడం ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయమని, జిల్లా కేంద్రంలోనే అభ్యర్థులకు అందుబాటులో ఉన్న ఈ శిక్షణ ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుత కృత్రిమ మేధ (ఏఐ) కాలంలో ఉద్యోగం పొందడం కష్టంతో కూడుకున్న పని అని‌, ప్రస్తుతం ఉద్యోగాలకు ఎంతో పోటీ ఉందని, ప్రతి ఒక్కరు కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని సూచించారు. దూర ప్రాంతాల విద్యార్థులకు వసతి సౌకర్య కల్పనలో తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.

 పోలీసు ఉద్యోగమే లక్ష్యంగా అభ్యర్థులు కష్టపడాలి: జిల్లా ఎస్పీ జానకి షర్మిల.

 పోలీసు ఉద్యోగమే లక్ష్యంగా ప్రతి ఒక్క అభ్యర్థి కష్టపడి చదువుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జిల్లా అభ్యర్థులకు ఉచిత పోలీసు శిక్షణలో సహకరించినవారికి, స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత పోలీసు శిక్షణకు దాదాపు 300 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారని అన్నారు. అభ్యర్థులకు ఒక పూట ఉచితంగా భోజనం, అల్పాహారం, అవసరమైన తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. సుదూర ప్రాంత విద్యార్థులకు అవసరమైన వసతి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగ సన్నద్ధానికి అవసరమైన మెటీరియల్ సమకూర్చేలా చూస్తామన్నారు. ఉద్యోగార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు అనుభవజ్ఞులైన అధ్యాపకులను నియమించామ ని, అలాగే స్వయంగా బోధనా అనుభవం ఉన్న పోలీసు సిబ్బందిచే సైతం విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి రెండ్రోజులకు ఒకసారి పరీక్షలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. దేహదారుఢ్య (ఫిజికల్ ఈవెంట్స్) పరీక్షలకు అవసరమైన శిక్షణ సైతం అందిస్తామన్నారు. ఎటువంటి ఇబ్బందులు కలిగినా అందుబాటులో ఉన్న సిబ్బందికి తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పి సాయి కిరణ్, డీఎస్పి శ్రీనివాస్, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News