రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తప్పదు
- ఎరువుల కొరతను వెంటనే నివారించాలి
- నకిలీ విత్తనాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
- రైతు భరోసా, రుణమాఫీ బకాయిలు తక్షణమే చెల్లించాలి: AIKC
అక్కన్నపేట, : అక్కన్నపేట మండల రైతాంగం ఎదుర్కొంటున్న ఎరువుల కొరత, నకిలీ విత్తనాలు, రైతు భరోసా, రుణమాఫీ, పంట నష్టపరిహారం, విద్యుత్ సరఫరా, గిట్టుబాటు ధర తదితర సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అఖిల భారత కిసాన్ సెంటర్ (AIKC) సిద్దిపేట జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు AIKC జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
ఎరువుల కొరతతో రైతుల అవస్థలు
అక్కన్నపేట మండలంలో యూరియా, DAP, కాంప్లెక్స్ ఎరువుల కోసం రైతులు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని AIKC నాయకులు పేర్కొన్నారు. ఎరువుల కొరతను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండల అవసరాలకు సరిపడా ఎరువులను వెంటనే సరఫరా చేసి గ్రామాల వారీగా సమానంగా పంపిణీ చేయాలని కోరారు. నకిలీ, నాసిరకం విత్తనాల విక్రయాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, రైతులు నష్టపోతే వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా, రుణమాఫీ బకాయిలు చెల్లించాలి
అర్హులైన రైతులతో పాటు కౌలు రైతులకు రైతు భరోసా సాయం సకాలంలో అందించాలని, రుణమాఫీకి అర్హత ఉన్నప్పటికీ ప్రయోజనం పొందని రైతుల వివరాలను పునఃపరిశీలించి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని AIKC కోరింది. అకాల వర్షాలతో దెబ్బతిన్న వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు గ్రామాల వారీగా సమగ్ర సర్వే నిర్వహించి నష్టపరిహారం, పంట బీమా పరిహారం అందించాలనిగ్ డిమాండ్ చేసింది.
పగటిపూట విద్యుత్.. పంటలకు గిట్టుబాటు ధర
వ్యవసాయ మోటార్లకు పగటిపూట నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, రాత్రివేళల్లో విద్యుత్ కోసం రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, ప్రతి క్లస్టర్ పరిధిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ముందుగానే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తేమ శాతం పేరుతో అనవసర కోతలు విధించకుండా రైతుల నుంచి పంటలను నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని కోరారు.
7 రోజుల్లో పరిష్కారం చూపాలి
మండల వ్యవసాయ అధికారి, AEOలు గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రైతు వేదికల్లో క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలని AIKC నాయకులు కోరారు. రైతుల సమస్యలను కాగితాలపై పరిష్కరించినట్లు చూపకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ఏడు రోజుల్లోగా స్పష్టమైన చర్యలు తీసుకుని పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో AIKC ఆధ్వర్యంలో రైతులను సమీకరించి మండల కార్యాలయం ఎదుట ధర్నా, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఎడబోయిన శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


