మారుమూల ఆదివాసీ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
ఆరుగురు నిపుణులైన వైద్య బృందంతో గ్రామ ప్రజలకు వైద్య సేవలు, 100 మంది గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు, వైద్య సేవలు, గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి.. త్వరలో మండల స్థాయి క్రీడా పోటీలు, గంజాయికి దూరంగా ఉండాలి.. పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలి
మూఢనమ్మకాలను విశ్వసించవద్దు.. అనారోగ్య సమస్యలకు వైద్యులను సంప్రదించాలి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్ బ్యూరో : ఆదివాసీ మారుమూల గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయాలను చేరువ చేయాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం కేశవ్ గూడ వజ్జర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆరుగురు నిపుణులైన వైద్య బృందం గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. సుమారు 100 మంది గ్రామ ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.
గ్రామానికి చేరుకున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కు గ్రామ ప్రజలు ఆదివాసీ సంప్రదాయాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని హనుమాన్ విగ్రహానికి పూజలు నిర్వహించి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చిన బోరు సమస్య, పాఠశాల భవన సమస్య, యువతకు డ్రైవింగ్ లైసెన్సుల ఏర్పాటు చేస్తానని, రక్తహీనత సమస్యల పై అవగాహన కల్పించారు. సంబంధిత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకొని త్వరలోనే వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామ యువతలో క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు త్వరలో మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తామని వెల్లడించారు.
మారుమూల గ్రామాల ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాలను చేరువ చేయడం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం పోలీస్ శాఖ లక్ష్యమని ఎస్పీ తెలిపారు. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వ లేదా ప్రైవేట్ వైద్యులను సంప్రదించాలని, బాబాలు, మంత్రాలు, తంత్రాలను నమ్మకుండా మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగి, అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. అనవసరంగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వాడవద్దని వాటి వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, విద్యార్థులు లక్ష్యంతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎస్పీ సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. గంజాయి సాగు, వినియోగం, రవాణా చట్టరీత్యా నేరమని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి సాగుకు దూరంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రజలు పోలీసులతో సమన్వయంతో ముందుకు రావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, బోథ్ సీఐ డి. గురుస్వామి, ఎస్ఐ వి. పురుషోత్తం, గ్రామ సర్పంచ్ కిషన్ పవర్, పటేల్ లాల్షా, ప్రభుత్వ వైద్యులు డా. మిథిలేశ్, డా. రాకేష్, డా. షోయబ్బుదిన్, నర్సింగ్ అధికారి శ్రీధర్, ఎల్.వి. ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు, ప్రైవేట్ వైద్యులు, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


