ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్‌ రాజర్షిషా

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్‌ రాజర్షిషా

ఆదిలాబాద్ :జిల్లాలో పారదర్శకమైన, తప్పులులేని ఓటర్ల జాబితా తయారీకి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా కోరారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (సార్‌)పై ఆయన సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాల్లో ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం నో-మ్యాపింగ్‌, వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో నోటీసులు జారీ చేసి ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ విచారణకు ఓటరే స్వయంగా హాజరు కావాల్సిన తప్పనిసరి నిబంధన లేదని, వారు రాలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు లేదా బంధువులు సైతం హాజరు కావచ్చని స్పష్టం చేశారు. విచారణకు వచ్చేవారు కుల, జనన ధ్రువీకరణ, పాస్‌పోర్టు, శాశ్వత నివాస పత్రం, మెట్రిక్యులేషన్‌, అటవీ హక్కుల పత్రం లేదా ప్రభుత్వ ఇళ్ల పట్టాలు లాంటి గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాని ఒరిజినల్‌ సర్టిఫికెట్‌తో పాటు ఒక సెట్‌ జిరాక్స్‌ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. నిర్దేశిత తేదీల్లో విచారణకు హాజరు కాలేకపోయిన వారికి తదుపరి ఏడు రోజుల వ్యవధిలో విచారణకు హాజరయ్యే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. అలాగే, 2026 అక్టోబరు 1 నాటికి అర్హత సాధించేవారు, జాబితాలో పేర్లు లేనివారు లేదా తప్పుల సవరణ కోరే వారి కోసం సెప్టెంబరు 5, 6, 12, 13 తేదీల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారని తెలిపారు. కొత్తగా పేరు నమోదుకు ఫారం-6, మార్పులు-చేర్పులు లేదా అభ్యంతరాలకు ఫారం-8తో పాటు డిక్లరేషన్‌ ఫారమ్‌లను పూర్తి చేసి ఆయా పోలింగ్ కేంద్రాల్లోని బీఎల్‌వోలకు అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవో జగదీశ్వర్‌ రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ, తహశీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News