శిశుగృహంలోని ఇద్దరు కవలల దత్తత ప్రక్రియ పూర్తి: కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్ : నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న దంపతులకు పారదర్శక విధానంలో చిన్నారులను దత్తత ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. బుధవారం స్థానిక విద్యానగర్‌లోని జిల్లా శిశుగృహం సంరక్షణలో ఉన్న 4 ఏళ్ల కవల పిల్లలను కలెక్టర్ తన చేతుల మీదుగా తమిళనాడు రాష్ట్రం, కోయంబత్తూరుకు చెందిన ఎస్. సెంథిల్ కుమార్- విజయలక్ష్మి దంపతులకు చట్టబద్ధంగా అప్పగించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ (CARA) పోర్టల్ ద్వారా ఎస్. సెంథిల్ కుమార్, శబరీష విజయలక్ష్మి దంపతులు దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. దరఖాస్తు పరిశీలన, ప్రభుత్వ విధివిధానాల ప్రకారం అన్ని అర్హతలు, నిబంధనలు సంతృప్తికరంగా పూర్తి కావడంతో చిన్నారులను స్వయంగా ఆ దంపతుల చేతులకు అందజేసినట్లు వివరించారు. దత్తత తీసుకున్న పిల్లలను ప్రేమతో, బాధ్యతాయుతంగా పెంచి ఉత్తమ భవిష్యత్తును అందించాలని దంపతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్, శిశుగృహ మేనేజర్ విజయలక్ష్మి, లీగల్ అధికారి రమేష్, సోషల్ వర్కర్, ఆయాలు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


