మంత్రి జూపల్లి సొంత గ్రామంలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్
- పెద్దదగడలో బీఆర్‌ఎస్‌లో చేరిన ఎక్స్ ఎంపీటీసీ, వార్డు మెంబర్, నాయకులు
- గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బీరం
చిన్నంబావి, : రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత గ్రామమైన వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గోద వెంకటేశ్వర్లు, 2వ వార్డు మెంబర్ జ్ఞానేశ్వరి కర్ణాకర్‌తో పాటు పలువురు కీలక నాయకులు బుధవారం కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో పురేందర్ గౌడ్, జంపుల రమేష్, వేముల వెంకటేష్ గౌడ్, ముని ఈశ్వర్, శివశంకర్, సహదేవుడు తదితరులు ఉన్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం కర్ణాకర్ మాట్లాడుతూ.. "సాధారణంగా ఎవరైనా అధికార పార్టీ వైపు వెళ్తారు. కానీ కాంగ్రెస్ నాయకుల మోసపూరిత వైఖరి వల్లే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లోకి రావలసి వచ్చింది. ఎన్నికల సమయంలో లక్షల రూపాయలు ఖర్చు చేసి పనిచేశా. ఉపసర్పంచ్ పదవి ఇస్తామని, ఊరిని అభివృద్ధి చేస్తామని చెప్పిన నాయకులు తీరా గెలిచాక తీవ్రంగా మోసం చేశారు. వంద రోజుల్లో రోడ్లు, గుడి, బ్యాంకు, రైతు వేదిక నిర్మించి ఆదర్శ గ్రామం చేస్తామన్న హామీలు ఏమయ్యాయి..? వంద రోజులు కాదు.. వెయ్యి రోజులైనా ఒక్క రూపాయి పని కూడా చేయలేదు. పనుల కోసం వెళ్తే కనీసం గుర్తుపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రెండేళ్లలోనే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపడం ఖాయం" అని మండిపడ్డారు.
పాలనపై వ్యతిరేకతకు ఈ చేరికలే నిదర్శనం: బీరం
మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక మంత్రి సొంత గ్రామంలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనడానికి ఈ భారీ చేరికలే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందించి అన్ని విధాలా అండగా నిలిచామని గుర్తుచేశారు. ఆరు గ్యారెంటీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తోందని, బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిన్నంబావి మండల బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


