వైద్య మాఫియాపై వైద్యశాఖ కొరడా!

వైద్య మాఫియాపై వైద్యశాఖ కొరడా!

  • విజన్ ఆంధ్ర ఎఫెక్ట్‌.. సూర్య హాస్పిటల్‌కు షోకాజ్ నోటీసు
  • అర్హత లేని వైద్య సేవలపై నిఘా.. మెట్‌పల్లిలో ప్రైవేట్ ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు

మెట్‌పల్లి  : “డాక్టర్ పట్టా లేకున్నా వైద్యం.. రోగుల ప్రాణాలతో చెలగాటం” అంటూ గత నెల 30న విజన్ ఆంధ్రలో వెలువడిన కథనంపై వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. అర్హత లేని వ్యక్తులతో వైద్య సేవలు అందిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. ముస్కు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మెట్‌పల్లి పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

సూర్య హాస్పిటల్‌పై ప్రత్యేక దృష్టి:

మెట్‌పల్లిలోని సూర్య హాస్పిటల్‌లో అర్హత లేని వ్యక్తి ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌గా సేవలు అందిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. వైద్యుల విద్యార్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, వైద్య రికార్డులు, ఆసుపత్రి అనుమతులు, సంబంధిత పత్రాలను పరిశీలించారు.
తనిఖీల్లో గుర్తించిన అంశాలపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని ఆసుపత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. నిర్ణీత గడువులో వివరణ సమర్పించాలని ఆదేశిస్తూ.. వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

ఇతర ఆసుపత్రుల్లోనూ తనిఖీల దూకుడు:

సూర్య హాస్పిటల్‌తో ఆగకుండా మెట్‌పల్లి పట్టణంలోని ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రుల రిజిస్ట్రేషన్, వైద్యుల అర్హతలు, మెడికల్ రిజిస్ట్రేషన్ వివరాలు, అనుమతులు, నిబంధనల అమలు తదితర అంశాలను పరిశీలించారు. అర్హత కలిగిన, నమోదిత వైద్యుల ద్వారానే వైద్య సేవలు అందించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. ముస్కు జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తదుపరి చర్యలపై ఉత్కంఠ:

మెట్‌పల్లిలో వైద్య ఆరోగ్యశాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం ప్రైవేట్ ఆసుపత్రుల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సూర్య హాస్పిటల్‌కు షోకాజ్ నోటీసు జారీ కావడంతో.. యాజమాన్యం ఇచ్చే వివరణపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది

Views: 47

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News