విద్యార్థినీలు చక్కగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
జ్యోతి బా పూలే గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక
మక్తల్, : మక్తల్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రియాంక బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పదో తరగతి తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. వారి విషయ పరిజ్ఞానం, చదువుపై ఆసక్తి, భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి అనంతరం ఏం చదవాలని అనుకుంటున్నారని విద్యార్థులను కలెక్టర్ ప్రశ్నించారు. డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీసు అధికారులు కావాలనుకునే విద్యార్థులు ఎంతమంది ఉన్నారో తెలుసుకున్నారు. ఐఏఎస్ కావాలంటే ఏ విధంగా చదవాలి, సివిల్స్ పరీక్షల్లో ఎలాంటి అంశాలు ఉంటాయనే విషయాలను విద్యార్థులకు వివరించారు. సివిల్స్ పరీక్షల్లో ప్రాథమిక విషయ పరిజ్ఞానానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, 8, 9, 10వ తరగతుల్లో చదివే సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లోని ప్రాథమిక అంశాలపై అవగాహన అవసరమని కలెక్టర్ తెలిపారు. కేవలం బట్టీ పట్టి చదవడం కాకుండా విషయాన్ని అర్థం చేసుకుని చదివే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. పోటీ పరీక్షల్లో లక్షలాది మంది పాల్గొన్నప్పటికీ తమ లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. ఇతరులు చదవడం లేదనే కారణంతో తాము చదువును నిర్లక్ష్యం చేయవద్దని, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు. చదువుతో పాటు ఆటలు ఆడాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం 5, 6వ తరగతి విద్యార్థులు రాస్తున్న ఎస్‌ఏ-1 పరీక్షను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పరీక్ష నిర్వహణ తీరును, విద్యార్థుల హాజరును పరిశీలించారు. పాఠశాల వంటగదిని సందర్శించిన కలెక్టర్ కూరగాయల నిల్వలు, విద్యార్థులకు అందిస్తున్న మెనూ వివరాలను పరిశీలించారు. అనంతరం స్టోర్ రూమ్‌ను పరిశీలించి అక్కడ పాఠశాల యూనిఫాంలు, బెడ్‌షీట్లు నిల్వ ఉంచడంపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తహసిల్దార్ సతీష్ కుమార్, పాఠశాల హెచ్ ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


