కల్లు దుకాణాలపై మాదకద్రవ్యాల అధికారుల మెరుపుదాడి!

కల్లు దుకాణాలపై మాదకద్రవ్యాల అధికారుల మెరుపుదాడి!

 శాంపిల్స్ సేకరణతో ఉలిక్కిపడ్డ విక్రయదారులు.. సమాచారం అందగానే షాపులు బంద్!!

కామారెడ్డి బ్యూరో  కామారెడ్డి పట్టణంలో కల్లు దుకాణాలపై మాదకద్రవ్యాల నియంత్రణ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది. ఉదయమే కామారెడ్డి పట్టణానికి చేరుకున్న అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి పట్టణ పరిధితో పాటు సమీప గ్రామాల్లోని కల్లు విక్రయ కేంద్రాలను తనిఖీ చేసి పలు శాంపిల్స్ సేకరించినట్లు తెలిసింది. అధికారులు శాంపిల్స్ సేకరిస్తున్నారనే సమాచారం క్షణాల్లో కల్లు విక్రయదారులకు చేరడంతో పలుచోట్ల దుకాణాలను మూసివేసినట్లు సమాచారం. కామారెడ్డి పట్టణ సమీపంలోని క్యాసంపల్లి, సరంపల్లి, ఉగ్రవాయి, గొల్లపల్లి ఇలిచిపూర్, రామేశ్వర్ పల్లి  లింగాపూర్ తదితర ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. అయితేWhatsApp Image 2026-10-07 at 12.10.27 PM దుకాణాలు మూసివేయడానికి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కామారెడ్డి ఎక్సైజ్ ఎస్‌హెచ్‌ఓ పోశెట్టి స్పష్టం చేశారు.
-  కృత్రిమ కల్లు ఆరోపణలపై కలకలం
కామారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల స్వచ్ఛమైన కల్లు పేరుతో కృత్రిమ లేదా కల్తీ కల్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. కొబ్బరికాయ, కుంకుడుకాయ తదితర పదార్థాలతో పాటు మత్తు కలిగించే రసాయనాలు కలుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రూ.10 నుంచి రూ.50 వరకు సీసా చొప్పున విక్రయాలు జరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.ప్రతి గ్రామంలో ఒకటికి మించి కల్లు విక్రయ కేంద్రాలు ఉండటం, ఉదయం నుంచే విక్రయాలు ప్రారంభమవుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో విక్రయ వేళలను నియంత్రించాలని పలువురు మేధావులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
- ఒక్కసారిగా నిషేధం కష్టమేనా?
కృత్రిమ కల్లుకు అలవాటు పడిన కొందరు గ్రామీణ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా కల్లు అందుబాటులో లేకపోతే తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని గత అనుభవాలను పలువురు గుర్తుచేస్తున్నారు. గతంలో కొన్నిచోట్ల కృత్రిమ కల్లు విక్రయ కేంద్రాలు మూసివేసిన సందర్భాల్లో కొందరిలో మానసిక ఆందోళన, అసహనం, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపించాయని వారు చెబుతున్నారు. అయితే వీటికి వైద్యపరమైన కారణాలను సంబంధిత నిపుణులు నిర్ధారించాల్సి ఉంటుంది.
కృత్రిమ కల్లు విక్రయాలను దశలవారీగా తగ్గించడంతో పాటు ప్రజలకు ప్రత్యామ్నాయ అవగాహన, వైద్య సహాయం అందించాలని పలువురు సూచిస్తున్నారు.
-  విక్రయ వేళలు మార్చాలన్న డిమాండ్
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 40 వరకు కల్లు విక్రయ కేంద్రాలు ఉన్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు విక్రయాలను నిలిపివేసి, రాత్రి 8 గంటల వరకు మాత్రమే విక్రయాలు నిర్వహించేలా వేళలను మార్చాలని పలువురు మేధావులు, సంఘసంస్కర్తలు సూచిస్తున్నారు. దశలవారీగా విక్రయాలను తగ్గించడం ద్వారా యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు పేర్కొంటున్నారు.
- ప్రజల్లో అవగాహనతోనే శాశ్వత పరిష్కారం
కృత్రిమ లేదా కల్తీ కల్లు సమస్యను కేవలం అధికారుల చర్యలతోనే పూర్తిగా పరిష్కరించడం సాధ్యం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మేధావులు, సామాజిక సేవా సంస్థలు, సంఘాల నాయకులు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కోరుతున్నారు. కల్తీ కల్లు సేవించడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను ప్రజలకు వివరించి, ముఖ్యంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు సమష్టిగా కృషి చేయాలని సూచిస్తున్నారు.
- శాంపిల్స్ తీసుకున్నాం.. దుకాణాలు మూసేయమని చెప్పలేదు
ఈ విషయమై కామారెడ్డి ఎక్సైజ్ సూపరిండెంట్ బి ముకుంద రెడ్డి ని ‘ఆదాబ్ హైదరాబాద్’ ప్రతినిధి ఫోన్‌లో సంప్రదించగా.. మాదకద్రవ్యాల నియంత్రణ అధికారులు శాంపిల్స్ సేకరించేందుకు కామారెడ్డికి వచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. వారి విధుల్లో భాగంగానే కొన్ని శాంపిల్స్ సేకరించారని చెప్పారు. కల్లు దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.కృత్రిమ, కల్తీ కల్లు విక్రయాలను అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై శక్తివంచన లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటు న్నా మని తెలిపారు. కామారెడ్డి జిల్లా పరిధిలో మాదకద్రవ్యాల విక్రయాలు, నాటుసారా, గుడుంబా తయారీకి తావులేదని, అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు కూడా లేదని స్పష్టం చేశారు.ఎక్కడైనా మాదకద్రవ్యాల విక్రయాలు, గంజాయి సాగు, నాటుసారా తయారీ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు నిబంధనల ప్రకారం అవార్డు కూడా అందజేస్తామని కామారెడ్డి ఎస్‌హెచ్‌ఓ పోశెట్టి తెలిపారు. అంతేకాకుండా కల్లు విక్రయించే ముస్తదారులు తనకు ఫోన్ చేయడం జరిగిందని అయితే యధావిధిగా కల్లు విక్రయించుకోవచ్చని తెలియజేయడం జరిగిందన్నారు. కళ్ళు దుకాణాలు మూసి ఉంచవలసిన అవసరం లేదన్నారు.

Views: 135

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News