వేరుశనగ రైతులకు డీకార్టికేటర్ ఎంతో ఉపయోగకరం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్: వేరుశనగ రైతులకు డీకార్టికేటర్ యంత్రం ఎంతో ఉపయోగకరమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం ఉప్పునుంతల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డీకార్టికేటర్ యంత్రం పనితీరును అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి ఆయన పరిశీలించారు. వేరుశనగ కాయల నుంచి పొట్టు తొలగించి నాణ్యమైన గింజలను వేరు చేసే విధానాన్ని అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో వేరుశనగ గింజలను వేరు చేయడానికి రైతులు అధిక సమయం, శ్రమ వెచ్చించేవారని, వ్యవసాయ యాంత్రీకరణతో పంట అనంతర పనులు సులభతరం అవుతాయన్నారు. చిన్న, సన్నకారు రైతులకు సమయం, శ్రమ ఆదా అవుతుందన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యంత్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. సాగు నుంచి పంట అనంతర ప్రక్రియ వరకు రైతులకు అవసరమైన సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, PACS అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


